పెద్దలు వెర్రి వెయ్యి విధాలు అంటారు. కొందరు మనుషులు చేస్తున్న పనులు చూస్తే ఈ మాట నిజం అనిపిస్తుంది. అభిమానం ఉంటే చాటుకోవడం తప్పులేదు.. కానీ పక్కన ఉన్నవారికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం సంస్కారం అనిపించదు. ఇలా అనాలోచితంగా కొందరు చేసే పనుల వల్ల ఒక్కోసారి తీవ్ర నష్టంతో పాటు.. ప్రాణ నష్టం జరిగినా జరగవచ్చు.. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్ర (Maharashtra) మాలేగావ్ (Malegaon)లోని మోహన్ సినిమా థియేటర్ (Mohan Cinema Theater)లో చోటు చేసుకుంది.
బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటించిన తాజా సినిమా టైగర్ 3 (Tiger 3 ) దీపావళి సందర్భంగా రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ చూడటానికి వచ్చిన కొందరు ఆకతాయిలు బీభత్సం సృష్టించారు. టాకీస్ హాల్ లోపలే భారీగా బాణాసంచా కాల్చడంతో.. సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు.
తారాజువ్వలను అంటించడం వల్ల థియేటర్ అంతా నిప్పు రవ్వలు ఎగిరిపడి పొగతో నిండిపోయింది. దీంతో సినిమా హాల్లోని ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. ఫలితంగా తొక్కిసలాట జరిగే ప్రమాదం కొద్దిలో తప్పింది. కానీ సినిమా హాల్లోని కుర్చీలు, పరదాకు మంటలు అంటుకుంటే జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు థియేటర్లో బాణసంచా కాల్చడాన్ని ప్రభుత్వం నిషేధించిన, కొందరు ఫాన్స్ బాణసంచా కాల్చుతూ హంగామా సృష్టించడం ఆందోళన కలిగిస్తుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.