కళ్ళు రెండు ఒకే దృశ్యాన్ని చూస్తాయి.. చెవులు రెండు ఒకే మాట వింటాయి.. అదేంటో తెలియదు కానీ.. నాలుక ఒకటి ఉన్న నలభై రకాలుగా మాట్లాడుతుంది. అందుకే పెద్దలు అంటారు కావచ్చు.. నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుందని.. ఈ పదాలు ఎందుకు గుర్తుకు వచ్చాయంటే.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఎవరికి నచ్చిన వాగ్ధానాలు వారు చేసుకుంటూ వెళ్తున్నారు.
అవి అమలవుతాయా? లేదా అనేది పక్కన పెడితే.. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేసిన విషయం తెలిసిందే. సామాన్య, మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. కనీవినీ ఎరుగని తీరుగా హామీలు గుప్పిస్తున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో రూ.500కే గ్యాస్ సిలిండర్ అన్నారు. బీఆర్ఎస్ రూ.400కే ఇస్తామని ప్రకటించింది.
అయితే గ్యాస్ సిలిండర్లపై ఓ జాతీయ పార్టీ సంచలన ప్రకటన చేసింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ.1కి ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది. ఈ ప్రకటనను సనత్నగర్ (Sanatnagar) నుంచి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (Allindia Forward Block Party) తరపున ప్రచారం చేస్తున్న కుమ్మరి వెంకటేష్ యాదవ్ (Venkatesh Yadav) చేశారు. స్థానిక నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న కుమ్మరి వెంకటేష్ ఒక్క రూపాయికే ఉచిత విద్య.. వైద్య సలహా.. న్యాయసలహా అందిస్తామని హామీ ఇచ్చారు.
అంతే కాకుండా.. ప్రతి 100 కుటుంబాలకు ఒక వలంటీర్ని ఏపీ తరహాలో నియమిస్తామని చెప్పారు. 70 ఏళ్లు పైబడిన వారు ఎమర్జెన్సీ ప్యానిక్ బటన్ నొక్కితే సాయం అందుతుందని ప్రచారం చేస్తున్నారు వెంకటేష్ యాదవ్. మరి ఓటర్లు ఇతని ప్రచారానికి తలొగ్గి గెలిపిస్తారో.. లేదా డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తారో వెయిట్ అండ్ సీ..