Satyendar Jain : ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్.. జైల్లో స్విమ్మింగ్ పూల్ కావాలన్నారని ఈడీ దిగ్భ్రాంతికరమైన విషయాన్ని కోర్టుకు తెలిపింది. మనీ లాండరింగ్ కేసులో జైన్ 2022 నుంచి ఈడీ కస్టడీలో ఉన్నారు. తన క్లయింటు ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని జైన్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింగ్వి శుక్రవారం సుప్రీంకోర్టును కోరగా… దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు ఈడీ లాయర్ తెలిపారు.
వెన్నెముకకు ఆపరేషన్ తరువాత జైన్.. కొన్ని ముఖ్యమైన వైద్య సంబంధ చికిత్సలు పొందుతున్నారని, అందువల్ల ఆయన మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని సింగ్వి కోరారు. అయితే ఆయన బెయిల్ ను పొడిగించడానికి మెడికల్ అడ్వైజ్ ఒక్కటే సరిపోదని, నిజానికి జైల్లో తనకు స్విమ్మింగ్ పూల్ కావాలని ఆయన కోరారని, ప్రతివారూ ఇలా కోరబోరని ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ .రాజు కోర్టుకు తెలిపారు.
అవసరమైతే జైన్ ను ఫిజియోథెరపీ కోసం స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకువెళ్ళవచ్చునన్నారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఆయన ఫిజియోథెరపీ చేయించుకుంటే మీరు దాన్ని ఫోటోలు తీసుకుని పబ్లిష్ చేస్తారని వ్యాఖ్యానించింది.
అనంతరం జైన్ బెయిల్ ను సెప్టెంబరు 1 వరకు పొడిగించేందుకు కోర్టు అంగీకరించింది. జైన్ రెగ్యులర్ బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ కూడా అదే రోజున లిస్ట్ లో ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తనకు బెయిల్ ను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు గత ఏప్రిల్ 6 న జారీ చేసిన ఉత్తర్వులను జైన్ సవాలు చేశారు.