బిల్కిస్ బానో ( Bilkis Bano )కేసులో దోషులకు సుప్రీం కోర్టు (Supreme Court) షాక్ ఇచ్చింది. ఈ కేసులో 11 మంది దోషులకు సరెండర్ అయ్యేందుకు సమయాన్ని పొడిగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దోషులంతా ఈ నెల 21లోపు లొంగి పోవాలని ఆదేశించింది. ఈ కేసులో నిందితులు పెట్టుకున్న దరఖాస్తులో చెబుతున్న కారణాలు గతంలో తాము జారీచేసిన ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చేందుకు సరిపోయేలా లేవని సుప్రీం కోర్టు పేర్కొంది.
గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసిన కేసులో తొమ్మిది మంది నిందితులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో లొంగి పోయేందుకు తమకు మరి కొన్ని రోజుల సమయం కావాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.
నిందితుల్లో గోవింద్ భాయ్ అనే వ్యక్తి తన తండ్రి (88),తల్లి (75) సంరక్షణ బాధ్యత తనపై ఉందని, అందువల్ల తనకు గడువు పొడిగించాలని కోరారు. మరో దోషి రమేశ్ రూపాభాయ్ చందనా…. తన కుమారిడి వివాహం జరగనుందని, అందువల్ల ఆరు వారాల సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇక మూడవ నిందితుడు మితేశ్ మన్లాల్ భట్…. శీతాకాలం పంట కోతకు ఉందన్నారు. తనకు ఆరు వారాల పొడిగింపు కావాలని అభ్యర్థించాడు.
కానీ దోషుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. నిందితులంతా ఆదివారం నాటికి జైలుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసులో క్షమాభిక్ష పెడుతూ గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగానే నిందితులను రిలీజ్ చేసింది. కానీ ఆ అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించింది. దోషులంతా జనవరి 21లోగా మళ్లీ జైలులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.