మధ్య తరగతి ప్రజల సొంత ఇంటి (Own House)ని కలను నెరవేర్చేందుకు కేంద్రం కొత్తగా గృహ నిర్మాణ పథకాన్ని తీసుకు రానుంది. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రకటన చేశారు. బస్తీలు, అద్దె ఇండ్లల్లో ఉండే వారు ఇండ్లు నిర్మించుకునేందుకు లేదా కొనుగోలు చేసేందుకు కేంద్రం మద్దతిస్తుందని తెలిపారు.
అద్దె ఇళ్ళు, మురికివాడలు, అనధికారిక కాలనీల్లో నివసిస్తున్న మధ్య తరగతి కుటుంబాల్లో అర్హులైన వర్గాలకు వారి సొంత ఇళ్ళు కొనడానికి లేదా నిర్మించుకోవడానికి తమ ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకు వస్తుందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన కింద ఇండ్లలో 70శాతం మహిళల పేరుపైనే ఇచ్చామని చెప్పారు.
కొవిడ్ కారణంగా సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అమలు కొనసాగించామన్నారు. పీఎం ఆవాస్ యోజనా- గ్రామీణ్ కింద మరో 2 కోట్ల ఇళ్లను అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. రూరల్ హౌసింగ్ స్కీమ్ కింద 3 కోట్ల ఇళ్ల లక్ష్యానికి దగ్గరగా ఉన్నామని పేర్కొన్నారు.
గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ…. మురికివాడలు, గుట్టలు, అనధికార కాలనీలు, అద్దె ఇళ్లలో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలు వడ్డీరేట్లలో ఉపశమనంతో బ్యాంకుల నుంచి గృహ రుణాలు పొందవచ్చని అన్నారు. దీనికి సంబంధించి త్వరలో ఒక పథకాన్ని తీసుకువస్తామని చెప్పారు.