– పాత బీజేపీ Vs కొత్త బీజేపీ
– టికెట్ల విషయంలో లుకలుకలు
– ఇప్పటిదాకా 88 స్థానాలకు ప్రకటన
– నాలుగో లిస్టుపై కసరత్తులు
– జనసేనతో పొత్తుపై భిన్నాభిప్రాయాలు
– ప్రకటించిన 88 సీట్లులో అధిక శాతం..
– కొత్తవారికే దక్కాయా?
– కీలకమైన స్థానాలు జనసేనకే ఇస్తున్నారా?
– ముందు నుంచి పార్టీని నమ్ముకున్న వారికి..
– అన్యాయం జరుగుతోందా..?
– రాజకీయ పండితుల విశ్లేషణ
తెలంగాణ (Telangana) ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నువ్వా నేనా అంటూ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా షురూ అయింది. ఒక్కొక్కరుగా అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. అయితే.. బీజేపీ (BJP) లో మాత్రం గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు రాజకీయ పండితులు. 10వ తేదీ వరకే నామినేషన్ల దాఖలుకు ఛాన్స్ ఉండడంతో పెండింగ్ లో ఉన్న 31 సీట్లకు వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. జనసేనకు 8 నుంచి 10 స్థానాలను కేటాయించి.. మిగిలిన వాటిలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది. అయితే.. సీట్ల కేటాయింపు అంశం వివాదాస్పదం అవుతోంది.
సీట్ల విషయంలో పార్టీ సిద్దాంతాలను పక్కన పెట్టేస్తున్నారా?
బీజేపీకి ఓ బ్రాండ్ ఉంది. నేతలు, కార్యకర్తలు క్రమశిక్షణతో ఉంటారని.. పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటారని అంటుంటారు. కానీ, ఈమధ్య కాలంతా అంతా గాడి తప్పిందని వివరిస్తున్నారు రాజకీయ పండితులు. ప్రకటించిన 88 సీట్లలో అధికశాతం ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే కేటాయించడం పట్ల నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు ఎక్కువయ్యాయని చెబుతున్నారు. ముందు నుంచి పార్టీ కోసం కష్టపడి, పార్టీ సిద్దాంతాలను నమ్ముకుని ముందుకు వెళ్తున్న వారిని కాదని చాలాచోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడంతో గొడవలు ఎక్కువవుతున్నాయని వివరిస్తున్నారు.
కొత్తవారితో ఎప్పటికైనా ప్రమాదమేనా?
తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను ఖాళీ చేసేందుకు తెలంగాణ భవన్ తలుపులు తెరిచి అందరికీ వెల్ కమ్ చెప్పారు. దీంతో చాలామంది నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. కారు ఓవర్ లోడ్ కావడం, కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం డౌన్ అవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీని భావించి అందులోకి చాలామంది నాయకులు చేరారు. కానీ, వారిలో ఎక్కువమంది నేతలు ఎప్పుడెప్పుడు జంప్ అవుదామా అనే ధోరణిలోనే ఉంటున్నారని పార్టీ సిద్దాంతాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈమధ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి గుడ్ బై చెప్పారు. ఇదే దారిలో మరికొందరు నేతలు జంప్ అవ్వొచ్చని విశ్లేషకుల అంచనా. క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో ఇలాంటి వారు చేరి అంతా పాడు చేస్తున్నారని కిందిస్థాయి కార్యకర్తలు ఫీలవుతున్నట్టు చెబుతున్నారు.
జనసేనతో పొత్తు అవసరమా?
జనసేన పార్టీ 2014 ఎన్నికల సమయంలో ప్రారంభించినా.. ఇంతవరకు తెలంగాణలో పోటీ చేసింది లేదు. 2014లో టీడీపీ, బీజేపీకి మద్దతు ప్రకటించింది. 2019లో ఆంధ్రాలో మాత్రమే బరిలో నిలిచింది. తెలంగాణలో సరైన నాయకులు లేకపోవడం, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టి సారించకపోవడంతో రాష్ట్రంలో జనసేన ప్రభావం తక్కువే అనేది విశ్లేషకుల మాట. అయితే.. ఆ పార్టీతో పొత్తు కోసం ఈసారి బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అమిత్ షాతో భేటీ అయిన పవన్ చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటు అంశంపై పంచాయితీ తెగడం లేదు. జనసేన ఎక్కువ స్థానాలు అడగడంతో బీజేపీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. బీజేపీ బలంగా ఉన్న స్థానాలను కూడా జనసేనకు కేటాయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది కొత్త పంచాయితీలకు దారి తీస్తోంది.
పార్టీ ఆఫీస్ కు క్యూ కడుతున్న అభిమానులు
పొత్తులో భాగంగా జనసేనకు శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, నాగర్ కర్నూల్ సహా పలు నియోజకవర్గాలను కేటాయిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొదట్నుంచి బీజేపీ సిద్దాంతాలకు కట్టుబడి పని చేస్తున్న ఆయా నియోజకవర్గాల నేతలు తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. నాగర్ కర్నూల్ నేత దిలీప్ చారి అయితే.. ఏకంగా పార్టీ ఆఫీస్ ముందే నిరసన తెలిపారు. జనసేనకు నాగర్ కర్నూల్ సీటు ఇవ్వొద్దని కోరుతూ ఆయన అభిమానులు, కార్యకర్తలు బీజేపీ స్టేట్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. నాగర్ కర్నూల్ లో జనసేన లేదని, అలాంటి పార్టీని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని దిలీప్ చారి మండిపడ్డారు. జనసేన పోటీలో పెడితే వచ్చే లాభమేంటని ఆయన ప్రశ్నించారు. అచ్చం ఇలాంటి ప్రశ్నలే శేరిలింగంపల్లి, కూకట్ పల్లి కార్యకర్తలు అడుగుతున్నారు. శేరిలింగంపల్లిలో మొదట్నుంచి గజ్జల యోగానంద్ పార్టీ కోసం కష్టపడుతున్నారు. అసలు, గుర్తింపే లేని స్టేజ్ నుంచి గెలుపు అవకాశం దిశగా నియోజకవర్గంలో పార్టీని బిల్డ్ చేశారని చెబుతున్నారు. అలాంటి స్థానాన్ని జనసేనకు కేటాయించొద్దని బీజేపీ శ్రేణులు పార్టీ కార్యాలయంలో వినతిపత్రాలు అందిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ బీజేపీలో సీట్ల పంపంకం పార్టీలో గందరగోళ పరిస్థితులకు దారి తీసిందని అంటున్నారు రాజకీయ పండితులు.