కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరగడంతో నేతలతో పాటు క్యాడర్ లో అయోమయం నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వల నేతలకు ప్రాముఖ్యత ఇస్తుండటంతో పార్టీనే నమ్ముకొని శ్రమించిన వారిలో అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress)లో చేరిన దానం నాగేందర్ (Danam Nagender)వ్యవహారం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.
బీఆర్ఎస్ కు హ్యాండ్ ఇచ్చి హస్తం పంచన చేరి సికింద్రాబాద్ (Secunderabad) ఎంపీ టికెట్ దక్కించుకొన్న దానం కు కాంగ్రెస్ ముందుగా సముచిత స్థానం కల్పించింది. కానీ ఆయనపెట్టిన కండిషన్స్ ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తుంది. ఈమేరకు ఆయనకు పార్టీ ఝలక్ ఇవ్వబోతుందా ? అనే చర్చ రాజకీయాల్లో మొదలైంది. ప్రస్తుతం దానం నాగేందర్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారైందనే టాక్ వినిపిస్తోంది.
అయితే దానం పార్టీలోకి వచ్చాక ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన కొన్ని కండీషన్లు పెట్టినట్లు ప్రచారం జరిగింది. వాటికి ఒకే అన్న అధిష్టానంపై మిగతా నేతలు గుర్రుగా ఉన్నట్లు గుసగుసలు వినిపించాయి. అదేవిధంగా తాను ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని, ఎంపీగా గెలిచాకే చేస్తానని దానం పెట్టిన కండీషన్ పార్టీ వర్గాలలో చర్చాంశనీయంగా మారింది.
ఇదిలా ఉండగా నాగేందర్ ప్రస్తుతం మరో కొత్త రాగం ఎత్తుకొన్నట్లు తెలుస్తోంది. తాను ఓడిపోతే మంత్రిపదవి ఇవ్వాలని, ఎంపీగా గెలిస్తే ఖాళీ అయ్యే ఖైరతాబాద్ స్థానం నుంచి తన అల్లుడికి సీటు ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అల్లుడా ఇంటికి రా అంటే.. అత్త నన్ను పెళ్లి చేసుకొంటావా అని అడినట్లు దానం వ్యవహారం ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి..
ఈ నేపథ్యంలో.. అసలు అభ్యర్థిని మార్చివేస్తే ఏ గోడవా ఉండదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు దానంను మారిస్తే బొంతు రామ్మోహన్ కు అవకాశం ఉన్నట్లుగా గాంధీభవన్ వర్గాలలో చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ కండీషన్ల విషయంలో దానం కొంత వెనకడుగు వేస్తే మాత్రం ఆయనే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది..