ఖమ్మం (Khammam) జిల్లా కేంద్రంగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీనియర్ నేత బాలసాని లక్ష్మీ నారాయణ(Balasani Lakshmi Narayana) బీఆర్ఎస్ (BRS)పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి పువ్వాడ అజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మంలో పలువురు నేతలు బీఆర్ఎస్ని దూరమవడం చర్చనీయాంశంగా మారింది.
మాజీ మంత్రి తుమ్మల, ప్రచార కమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రంగంలోకి దిగి.. ఆపరేషన్ ఆకర్ష్‌కి తెర లేపారు. ఫలితంగా మాజీ ఎమ్మెల్సీ, మరో ముగ్గురు కార్పొరేటర్లు, ఇద్దరు మాజీ కార్పొరేటర్లు, మరికొంత మంది నాయకులు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే మంత్రి పువ్వాడ అజయ్ పార్టీలో పరిణామాలు చక్కదిద్దేందుకు రంగంలోకి దిగడంతో.. ఖమ్మం రాజకీయం కాక రేపుతోంది.
హైదరాబాద్ లో ఉన్న మంత్రి పువ్వాడ కార్పొరేటర్లకు ఫోన్ చేసి పార్టీని వీడొద్దని కోరినా వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో పువ్వాడ ఖమ్మం వెళ్లి కార్పొరేటర్లు, నియోజకవర్గ ముఖ్యనేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో నెలకొన్న పరిణామాలపై చర్చించారు. అంతా పార్టీ గెలుపు కోసం పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. మరో వైపు భీ-ఫారాల పంపిణీ, మేనిఫెస్టో ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో కోలాహలం నెలకొన్న తరుణంలో ఖమ్మంలో జరిగిన రాజకీయ పరిణామాలు బీఆర్ఎస్ని కలవరానికి గురి చేస్తున్నాయని ప్రచారం జరుగుతోంది.