శంషాబాద్ ఎయిర్పోర్ట్ (Shamshabad Airport) కు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు బాంబుస్కాడ్ టీమ్స్‌తో తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పెట్టాడు. అప్రమత్తమైన జీఎంఆర్ సెక్యూరిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
భద్రతా సిబ్బంది ఎయిర్ పోర్ట్‌లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా బాంబు ఆచూకీ లభ్యం కాకపోవటంతో తనిఖీల అనంతరం ఎయిర్ పోర్ట్‌లో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు మెయిల్ నకిలీదని అధికారులు గుర్తించారు.
బాంబు బెదిరింపుకు పాల్పడిన ఆగంతుకుడి ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. మతిస్థిమితంలేని వ్యక్తి రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు (ఆర్జీఐఏ) కస్టమర్ కాల్ సెంటర్‌కు మెయిల్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, అదే మెయిల్ నుంచి తిరిగి క్షమాపణలు కోరుతూ యువకుడి తల్లిదండ్రులు లెటర్ పంపినట్లు తెలిసింది.
బాంబు బెదిరింపు అంతా ఫేక్‌గా తేలడంతో భద్రత సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్ చేసిన వ్యక్తి గురించి గాలిస్తున్నట్లు తెలిపారు.