పాకిస్థాన్ (Pakistan) ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. పీఎంఎల్-ఎన్(PML-N), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)ల తరపున అభ్యర్థిగా ఉన్న షెహబాజ్.. జాతీయ అసెంబ్లీలో ఆదివారం నిర్వహించిన ఓటింగ్‌లో మొత్తం 336 ఓట్లకుగానూ 201 ఓట్లు సాధించారు.
అయితే, షెహబాజ్‌కు పోటీగా జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI) పార్టీ అభ్యర్థి ఒమర్ అయూబ్‌ఖాన్‌కు 92 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓటింగ్ సందర్భంగా పీటీఐ మద్దతుగల చట్టసభ్యుల నినాదాలతో పార్లమెంటులో గందరగోళం నెలకొంది.
కాగా, షెహబాజ్ సోమవారం అధ్యక్ష భవనంలో దేశ 33వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్ అనంతరం మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు షరీఫ్. గతేడాది ఆగస్టు వరకు సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు.
అదేవిధంగా పాకిస్థాన్ పార్లమెంటులో షెహబాజ్ షరీఫ్‌కు 201 మంది సభ్యుల మద్దుతు లభించింది. ప్రధాని అయ్యేందుకు 169 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, ఇటీవల పలు వివాదాల నడుమ పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్, పీపీపీ కూటమి విజయం సాధించింది