Telugu News » Kaleswaram : కాళేశ్వరం అధ్యయనానికి కమిటీ.. ఏం జరగనుంది?

Kaleswaram : కాళేశ్వరం అధ్యయనానికి కమిటీ.. ఏం జరగనుంది?

కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈ కమిటీకి అమితాబ్ మీనా మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు.

by Venu

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో సంచలనంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలతో పాటు.. అధికార పార్టీ నేతలు మేడిగడ్డను సందర్శించారు. పలు కీలక విషయాలను వెల్లడించారు.. ఈ నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం మరియు సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలను పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది.

Kaleswaram Project Defects

ఈ మేరకు కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈ కమిటీకి అమితాబ్ మీనా మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నుంచి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. రాష్ట్ర పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం డ్యామ్ విషయంలో అప్రమత్తమైంది.

ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (Medigadda), అన్నారం (Annaram) మరియు సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ లేఖపై స్పందించిన ఎన్డీఎస్ఏ మూడు బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా బ్యారేజీలను పరిశీలించి కుంగుబాటుకు, పగుళ్లు ఏర్పడటానికి గల కారణాలను కమిటీ సభ్యులు విశ్లేషించాలని సూచించింది.

అదేవిధంగా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలను కూడా తెలపాలన్న ఎన్డీఎస్ఏ (NDSA) .. నాలుగు నెలల్లో నివేదికను అందించాలని కమిటీకి తెలిపింది. ఇదే సమయంలో కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్ట్ నిర్మాణంలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన గులాబీ పెద్ద బాస్ ఇప్పటి వరకు నోరు మెదపక పోవడంపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి.. పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..

You may also like

Leave a Comment