హిందూ మహా సముద్రంలో మరో నౌక హైజాక్ అయింది. సోమాలియా తీరం (Somalia Coast)లో లైబీరియా జెండా ఉన్న 15 మంది భారతీయుల (Indians)తో ప్రయాణిస్తున్న నౌక ఒకటి హైజాక్ అయినట్టు అధికారులు తెలిపారు. నౌక హైజాక్ కు గురైన విషయాన్ని యూకే మారిటైమ్ ఏజెన్సీ భారత్ కు సందేశం పంపించింది. కొంతమంది సాయుధులైన గుర్తు తెలియని వ్యక్తులు నౌకలోకి ప్రవేశించారని పేర్కొంది.
సమాచారం అందుకున్న ఇండియన్ నేవి వెంటనే అలర్ట్ అయింది. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. సముద్ర గస్తీ కోసం కేటాయించిన ఐఎన్ఎస్ చెన్నైని ఇండియన్ నేవి రంగంలోకి దించింది. హైజాక్ కు గురైన ‘ఎంవీ లీలా నారో ఫోక్’నౌకపై ఐఎన్ఎస్ చెన్నై నిఘా పెడుతుందని పేర్కొంది. మరోవైపు హైజాక్ కు గురైన ప్రాంతంలో ఇండియన్ నేవీ ఎయిర్ క్రాఫ్టులను కూడా మోహరించింది.
ప్రస్తుతం నౌకలో ఉన్న సిబ్బందితో కమ్యూనికేషన్ ఏర్పడిందని తెలిపింది. సిబ్బంది సురక్షితంగా ఉన్నట్టు నేవి అధికారులు చెబుతున్నారు. సొమాలియాకు తూర్పున 300 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రపు దొంగలు నౌకను హైజాక్ చేసినట్టు తెలుస్తోంది. ఇది పోర్ట్ డు అకో (బ్రెజిల్) నుంచి బహ్రెయిన్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు చెప్పింది.
ఇటీవల సొమాలియా తీరంలో నౌకలపై సముద్ర దొంగలు దాడులు చేస్తున్నారు. వాటిని హైజాక్ చేస్తున్నారు. 2008 నుంచి 2013 మధ్య ఈ దాడులు అధికంగా ఉండేవి. కానీ భారత నౌక దళంతోపాటు పలు దేశాల మారిటైమ్ టాస్క్ఫోర్స్ సమిష్టి ప్రయత్నాల కారణంగా ఈ దాడులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో మళ్లీ దాడులు పెరిగాయి.