తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న హెచ్ఎండీఏ (HMDA) మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Siva Balakrishna) కేసు ఊహించని మలుపులు తీసుకొంటుంది. ఇప్పటికే ఏసీబీ కస్టడీలో ఆయన వాంగ్మూలం నివేదికలో ఓ ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావించారు. బాలకృష్ణ ద్వారా ఐఏఎస్ అరవింద్ కుమార్ తనకు కావాల్సిన బిల్డింగ్ కు అనుమతులు జారీ చేయించుకున్నట్లు తేలింది. దీంతో ఈ కేసుపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ రోజు బాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ పూర్తయ్యింది. అన్ని వాదనలు విన్న నాంపల్లి (Nampally) ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ పై తీర్పు, వచ్చే సోమవారం నాటికి వాయిదా వేసింది. మరోవైపు శివ బాలకృష్ణకు బెయిల్ మంజూరు చెయ్యొద్దని ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. అయితే బాలకృష్ణ తరపు న్యాయవాది బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టును కోరారు.
కాగా ఈ కేసులో కస్టడి కన్ఫేషన్ స్టేట్మెంట్ కీలకంగా మారిన విషయం తెలిసిందే.. పలువురి ఒత్తిడి మేరకే అక్రమాలు, ఆస్థులు అంటూ శివబాకృష్ణ స్టేట్మెంట్ ఇవ్వడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే బాలకృష్ణ వద్ద దొరికిన డాక్యుమెంట్ లెక్కల ప్రకారం 1000 కోట్ల విలువైన ఆస్తులు, 214 ఎకరాలు భూములు ఏసీబీ గుర్తించింది. ఈ క్రమంలో ఆయనతో పాటు ఇతర అధికారుల పాత్ర పై ఆరా తీస్తున్నారు.
శివ బాలకృష్ణ బినామీలపై దృష్టి సారించిన ఏసీబీ.. ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ కేసుపై ఈడీ, ఐటీ ఫోకస్ పెట్టింది. కేసు వివరాల సేకరణలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కొనసాగుతున్నాయి. ఈమేరకు బాలకృష్ణ సోదరుడు నవీన్ అదుపులో తీసుకొన్న అధికారులు మరో ఇద్దరి అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
మరోవైపు పలువురు అధికారులు డీవోపీటీ అనుమతులు లేకుండా ఆస్తులు కొనుగోళ్లు చేసినట్టు తెలుస్తుంది. మొన్న సోమేశ్ కుమార్ ఆస్తుల విషయం వెలుగులోకి రాగా.. తాజాగా రజత్ కుమార్ ఆస్తుల పేపర్లు వెలుగులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్‌లోని హేమాజీపూర్‌లో 52 ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 15 ఎకరాల కొనుగోలు చేసినట్టు తెలిసింది.