సిద్దిపేట (Siddipet)లో నిన్న భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. పట్టణంలోని 130 KV సబ్ స్టేషన్ (Sub Station)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు పెరిగి సబ్ స్టేషన్ మొత్తానికి అంటుకొని ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడ్డాయి. కాగా ఈ ప్రమాద ఘటనా స్థలాన్ని నేడు తెలంగాణ (Telangana) రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ట్రాన్స్ కో డైరెక్టర్, టెక్నీకల్ డైరెక్టర్ జగత్ రెడ్డి.. జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి 100,160 మెగావాట్ల సబ్ స్టేషన్ కు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారని తెలిపారు.. ప్రస్తుతం జరిగిన నష్టం చూసి రెండు మూడు రోజుల వరకు పవర్ రాదని భావించారు.. కానీ, వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి.. రైతులకు నేటి ఉదయం నుంచి త్రీఫేస్ కరెంటు ఇచ్చే దిశగా చర్యలు చేపట్టామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
మరోవైపు ప్రమాదానికి గురైన ట్రాన్సఫార్మర్స్ 20-30 ఏళ్ళ క్రితం అమర్చినట్లు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అన్నారు. ప్రమాదానికి గురైన సబ్ స్టేషన్ వద్ద వెంటనే మరమ్మత్తులు చేపట్టడంతో పాటు, సబ్ స్టేషన్ లో అవసరమైన పరికరాల మార్పులు చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని వివరించారు.
అలాగే ట్రాన్సఫార్మర్స్ ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే చర్యలు చేపట్టిన వారిని అభినందిస్తున్నామని, రైతులకు, స్థానికంగా ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రమాదంలో నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారని.. త్వరలోనే పూర్తి వివరాలు తెలియచేస్తామని మంత్రి తెలిపారు.