రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ (Finance Commission Chairman)గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య (Siricilla Rajaiah)ను తెలంగాణ (Telangana) ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ఆయన నేడు బాధ్యతలు చేపట్టారు. ఈయనతో పాటు కమీషన్ సభ్యులుగా ఎంపికైనా సంకేపల్లి సుధీర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, నెహ్రు నాయక్ సైతం బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటికే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉత్తర్వులు జారీ చేయగా తాజాగా బాధ్యతలు స్వీకరించారు. కాగా వీరంతా రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్, కమీషన్ సభ్యులు ఎర్రమంజిల్ (Errum Manzil) కార్యాలయంలో చార్జ్ తీసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ స్మితా సబర్వాల్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. నాపై విశ్వాసం ఉంచి నాకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.. ఆర్ధికంగా గ్రామపంచాయితీలు బలోపేతం కావాలని, రాజీవ్ గాంధీ ఫైనాన్స్ కమీషన్స్ ఏర్పాటు చేశారని తెలిపిన సిరిసిల్ల రాజయ్య.. గత ప్రభుత్వం ఫైనాన్స్ కమీషన్ ను నిర్విర్యం చేసిందని ఆరోపించారు.
నిధులు ఇవ్వలేక గ్రామాలు, మున్సిపాలిటీలు అల్లాడుతున్నాయని అన్నారు. మూలన పడిన ఫైనాన్స్ కమీషన్ ను సీఎం రేవంత్ రెడ్డి పునరుద్దరించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు గ్రామాలను, మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి కృషి చేస్తామని సిరిసిల్ల రాజయ్య వెల్లడించారు.