కాంగ్రెస్ గ్యారెంటీ కార్డును ఆ పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ ఈ రోజు ప్రకటించారు. ఈ చారిత్రక దినోత్సవం రోజు ప్రజలతో ఈ ఆనందాన్ని పంచుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. తమ ప్రభుత్వం వస్తే మహిళలకు మహాలక్ష్మీ కింద రూ. 2500 వేలు ఇస్తామని ప్రకటించారు.
గ్యాస్ సిలిండర్ రూ. 500 లకు అందిచనున్నట్టు వెల్లడించారు. దీంతో పాటు టీఎస్ ఆర్టీసీలో మహిళకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తామన్నారు. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చేందుకు తాము ఆరు హామీలను ప్రకటిస్తున్నామని చెప్పారు. తుక్కు గూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ ఏర్పాటులో తాము పాలు పంచుకోవడం తనకు చాలా సంతోషంగా వుందన్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకు వెళ్లడం తమ విధి అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల కోసం పని చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడాలన్నదే తన స్వప్నమన్నారు. మీరంతా మాకు మద్దతు ఇస్తారా అని అడిగారు.
అనంతరం కాంగ్రెస్ గ్యారెంటీ కార్డును ప్రకటించారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ప్రతి నెలా రూ. 2,000 సాయం చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తామన్నారు. రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. రైతు భరోసా కింద రైతులు, కౌలురైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయమందిస్తామన్నారు.
వ్యవసాయ కూలీలకు ప్రతి ఏడాది రూ. 12,000 సాయమందిస్తామన్నారు. వరి పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ. 5 లక్షల సాయమందిస్తామన్నారు.
ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల స్థలం కేటాయిస్తామన్నారు. యువ వికాసం కింద విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చేయూత కింద నెలకు రూ. 4,000 చొప్పున పింఛను. రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కల్పిస్తామన్నారు.