ఇవాళ(శనివారం) కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Soniya Gandhi) 77వ పుట్టినరోజు. సోనియా గాంధీకి రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కూడా సోనియా గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోడీ సోనియా గాంధీకి X(ట్విట్టర్) వేదికగా విషెస్ తెలిపారు. ట్విట్టర్ పోస్టులో..‘‘’శ్రీమతి సోనియా గాంధీజీ.. మీరు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నా..’ అంటూ ప్రధాని మోడీ రాసుకొచ్చారు.
Best wishes to Smt. Sonia Gandhi Ji on her birthday. May she be blessed with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) December 9, 2023
అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఇది పండుగ రోజని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. గాంధీ భవన్లో ఇవాళ సోనియా బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. సోనియా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. సోనియా గాంధీ 60 ఏళ్ల కల నెరవేర్చిందన్నారు.
పదేళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. కార్యకర్తల కష్టం, త్యాగంతోనే అధికారంలోకి వచ్చామని రేవంత్రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు. డిప్యూటీ సీఎం విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
సోనియాగాంధీ 1946 డిసెంబర్ 9న ఇటలీలో జన్మించారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీని వివాహం చేసున్నారు. మొదట్లో క్రియాశీల రాజకీయలకు దూరంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత సోనియా గాంధీ భార్త మరణం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అత్యధిక కాలం పని చేసిన సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో గత కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.