బీఆర్ఎస్ (BRS) అంటేనే మండిపడే కోమటిరెడ్డి బ్రదర్స్.. మరోసారి.. వార్తల్లో నిలిచారు.. రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణను సర్వనాశనం చేసిందని.. అన్ని ప్రభుత్వ శాఖలను అప్పుల కుప్పగా మార్చిందని ఆర్ అండ్ బీ మంత్రి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో పాల్గొన్న వెంకట్ రెడ్డి.. అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు..
సిట్టింగ్ జడ్జి విచారణ నివేదిక రాగానే బీఆర్ఎస్ అవినీతిపై యాక్షన్ తీసుకుంటామని తెలిపిన వెంకట్ రెడ్డి.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇకపై ఉండదని.. ఆ పార్టీ నాలుగు ముక్కులు అవుతోందని షాకిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) సైతం బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోందని అన్నారు. అధికారం లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు మతి తప్పి మాట్లాడుతున్నట్టు రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పై అన్నదమ్ములు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పలువురు కాంగ్రెస్ (Congress) వైపు చూస్తోన్నట్లు, హస్తం నేతలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే..
గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే గోడ దూకేందుకు నేతలు రెడీ ఉన్నారని జోరుగా గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి.. ఇక బీఆర్ఎస్ పతనం మొదలైందని కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన వ్యాఖ్యలపై గులాబీ పెద్ద బాస్, చిన్న బాస్ ఎలా స్పందిస్తారో చూడాలి అని అనుకొంటున్నారు.. బీఆర్ఎస్ నేతలు సైతం కాంగ్రెస్ ఎక్కువకాలం అధికారంలో ఉండదనే వ్యాఖ్యలు చేయడం తెలిసిందే..