దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తి (Srikalahasti) క్షేత్రం మాస్టర్‌ప్లాన్ (Master Plan) అమలుకు మార్గం ఎట్టకేలకు సులభం అయ్యింది. త్వరలోనే శ్రీకాళహస్తిని చుట్టుముట్టిన కష్టాలు తొలగిపోనున్నాయి. తోందర్లోనే అధికారులు 300 కోట్ల రూపాయల ఖర్చుతో మూడు దశల్లో పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
ఈ మేరకు ఆలయ పాలక మండలి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసిన ద్రోణ కన్సల్టెన్సీ సంస్థతో భేటీ అయ్యారు అధ్యక్షులు అంజూరు శ్రీనివాస్ (Srinivas). ఈ సందర్భంగా మొత్తం 300 కోట్ల రూపాయల (300 crore rupees) ఖర్చుతో మూడేళ్లలో మాస్టర్ ప్లాన్ పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు దశల్లో మాస్టర్ ప్లాన్ అమలు చేసే విధంగా డిజైన్లను పరిశీలించిన పాలకమండలి ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది.
ఇకపోతే క్యూ కాంప్లెక్సులు, సర్పదోష మండపాలు, ధూర్జటి కళా మండప నిర్మాణ పనులు మొదటి దశలో, స్వర్ణ ముఖి ప్రక్షాళన, స్నాన ఘట్టాల నిర్మాణం రెండో దశలో, భరద్వాజ తీర్థం, అతిధి గృహాల నిర్మాణ పనులు మూడోదశలో పూర్తి చేసేలా శ్రీకాళహస్తి ఆలయ అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు.
మూడేళ్ల క్రితమే 100 కో ట్ల రూపాయలతో భూసేకరణ పూర్తి చేసిన దేవస్థానం మరో 10 రోజుల్లో మొదటి దశ మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నిర్మాణాలలో భాగంగా గాలిగోపురం నుంచి జల వినాయకుడి ఆలయం వరకు, అక్కడి నుంచి నాలుగవ నెంబర్ గేటు వరకు రెండు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు అధికారులు.