భూతల స్వర్గం జమ్మూకశ్మీర్ (Jammu And Kashmir) మంచు గుప్పిట్లో చిక్కుకుంది. దీంతో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. సందర్శకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్ని ఏరియాల్లో అయితే మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి.
సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీనగర్ (Srinagar)లో ఉష్ణోగ్రతలు మైనస్ 5.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.
ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలో నమోదవడంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సులో చలి తీవ్రతకు నీరు గడ్డకట్టింది. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గల పహల్గామ్లో కూడా ఉష్ణోగ్రతలు మైనస్ 5.7 సెల్సియస్‌కు పడిపోయాయి.
కుప్వారాలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా మైనస్ 4.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఖాజిగుండ్‌లో మైనస్ 3.6 డిగ్రీల సెల్సియస్, కోకెర్నాగ్ పట్టణంలో కనిష్టంగా మైనస్ 1.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ సీజన్ ఇదే రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.