100
మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ మాజీ నేత అశోక్ చవాన్ (Ashok Chavan) బీజేపీ గూటికి చేరారు. రాష్ట్ర ఉపముఖ్య మంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు. ఆయనకు రాజ్య సభ టికెట్ ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మరి కొద్ది గంటల్లో ఓ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అంతకు ముందు తాను బీజేపీలో చేరబోతున్నట్టు అశక్ చవాన్ ట్వీట్ చేశారు. తన రాజకీయ జీవితంలో ఒక నూతన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ను వీడిన మూడవ ప్రముఖ నేత అశోక్ చవాన్ కావడం గమనార్హం.
అంతకు ముందు దక్షిణ మహారాష్ట్ర మాజీ ఎంపీ, సీనియర్ నేత మిళింద్ దియోర, మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దిఖీలు కాంగ్రెస్ ను వీడారు. అంతకు ముందు తాను కాంగ్రెస్ వీడుతున్నట్టు అశోక్ చవాన్ ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.
తనకు పార్టీపై ఎలాంటి కంప్లైంట్స్ లేవని చెప్పారు. తాను నిన్నటి వరకు పార్టీ కోసం అత్యంత నిజాయితీగా పని చేశానని వెల్లడించారు. అశోక్ చవాన్ 2014-19 మధ్య కాలంలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. మహారాష్ట్ర సీఎంగా 2008 డిసెంబర్ నుంచి 2010 నవంబర్ వరకు పనిచేశారు.