అంతర్జాతీయ క్రికెట్‌లో టెక్నాలజీ ఒక భాగమైంది. వీటిలో అంపైర్ల నిర్ణయాన్ని సవాల్ చేసే డీఆర్ఎస్ (DRS) పద్ధతి ఎంతో పాపులర్ అయింది. త్వరలోనే మరో కొత్త నిబంధన క్రికెట్‌లో భాగం కానుంది. ఇన్నిరోజులు ప్రయోగ దశలో ఉన్న ‘స్టాప్ క్లాక్ రూల్’ (Stop Clock Rule)ను ఐసీసీ(ICC) శాశ్వతం చేయనుంది.
జూన్‌లో వెస్టిండీస్, అమెరికా గడ్డపై జరిగే టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024)తో ఈ నియమాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తేవడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఐసీసీ తాజాగా వెల్లడించింది. గతేడాది డిసెంబర్ నుంచి స్టాప్ క్లాక్ రూల్‌ను ప్రయోగాత్మకంగా పలు మ్యాచుల్లో అమలు చేసింది ఐసీసీ.
ఈ నిబంధన వర్కవుట్ కావడంతో ఐసీసీ దీన్ని శాశ్వతంగా అమల్లోకి తేచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ నిబంధన ఏంటంటే..? ఓవర్లకు ఓవర్లకు మధ్య ఎలక్ట్రానిక్ గడియారాన్ని చూపిస్తారు. నిర్ణీత సమయంలోపు ఓవర్ల కోటా పూర్తి చేసేలా ఇరుజట్ల కెప్టెన్లను ఈ కొత్త రూల్ అప్రమత్తం చేస్తుంది.
అంతేకాదు ఫీల్డింగ్ జట్టుకు ఓవర్ల మధ్య 60 సెకన్ల సమయం ఉంటుంది. స్టాప్ క్లాక్‌లో సున్నా వచ్చేంత వరకు మరో బౌలర్ ఓవర్ వేయాల్సి ఉంటుంది. ఇలా వన్డేలు, టీ20ల్లో ప్రతీ ఓవర్ తర్వాత స్టాప్ క్లాక్‌ను చూపిస్తారు. ఒకవేళ నిర్ణీత సమయంలోపు కొత్త ఓవర్ వేయకుంటే రెండు సార్లు హెచ్చరించిన తర్వాత ఐదు పరుగుల పెనాల్టీ విధించనున్నారు.