తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections)కు పోలింగ్ ముగియడంతో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠగా మారింది. ఇక, ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నా ఎట్టకేలకు ఎన్నికలు ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఓటింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్‌లో(Strong Rooms)లో భద్రపరిచారు.
స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 144 సెక్షన్‌తో పాటు మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నారు. డిసెంబర్ 3వ తారీఖున ఓట్ల లెక్కింపు జరగనుండగా ఫలితాల కోసం అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమాతో ఎదురుచూస్తున్నారు.
అయితే, మొదటి అంచెలో పారామిలటరీ బలగాలు, రెండో స్థాయిలో సాయుధ సిబ్బంది, మూడో స్థాయిలో సివిల్ పోలీసులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. అగ్నిప్రమాదానికి అవకాశం లేకుండా అగ్నిమాపక పరికరాలను సైతం అధికారులు అందుబాటులో ఉంచారు. స్థానిక పోలీసులు, ఆర్మ్‌డ్ రిజర్వ్, కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పహారా కాస్తున్నాయి.
ఈ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఒక డీసీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులను తప్పా ఎవరినీ అనుమతించడంలేదు. స్ట్రాంగ్ రూమ్‌కు ఒకే ప్రవేశ ద్వారం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గదికి డబుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
అదేవిధంగా స్ట్రాంగ్ రూం 24గంటలు సీసీ కెమెరా నిఘాలో ఉంచారు. ఇక్కడి సిబ్బంది దృశ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టారు. స్ట్రాంగ్ రూమ్ యొక్క మూడంచెల భద్రతలో, మొదటి స్థాయిలో కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. దీని కోసం, కనీసం ఒక విభాగంలో 13 మంది 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా కేటాయించారు.