రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలహీనంగా ఉందని కొన్ని సర్వేలు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పాఠశాలల సమస్యల పై మాట్లాడితే.. నేతలు మాత్రం చదువుల విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెడుతున్నట్టు వెల్లడిస్తారు. ఇక తెలంగాణ (Telangana)లో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించింది. అయితే లోతుగా తెలుసుకుంటే కానీ వీటి బండారం భయటపడదని అంటున్నారు..
ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న స్కూళ్ల సమస్యలు కోకొల్లలు.. అయితే తాజాగా జగిత్యాల (Jagityala) జిల్లాలో చదువుకుంటున్న విద్యార్థులకు పెద్ద సమస్య ఎదురైంది. కొడిమ్యాల (Kodimyala) మండల కేంద్రం మోడల్ స్కూల్లో (Model School) చదువుకొంటున్న విద్యార్థులు టీచర్ల కోసం ధర్నా చేపట్టారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ టీచర్లు లేక 10వ తరగతి క్లాసులు జరగడం లేవని వాపోతున్నారు.
ఈ విద్యా సంవత్సరం పూర్తికావస్తున్నా టీచర్లు లేక.. క్లాసులు జరగకపోవడవంతో తామంతా ఆ సబ్జక్ట్ లపై పరీక్షలు ఎలా రాయాలని విద్యార్థులు ప్రశ్నించారు. ఈ రోజు క్లాసులు బైకాట్ చేసిన విద్యార్థులు.. స్కూల్ బయట ఆందోళనకు దిగారు. ఆయా సబ్జెక్ట్ ల టీచర్లు లేక చదవలేకపోతున్నామని.. వెంటనే టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు విద్యార్థులకు ఎస్ఎమ్ సీ చైర్మెన్ శ్రీనివాస్ చారి మద్దతు తెలిపారు. కాగా టీచర్ల నియామకానికి రెండు సార్లు నోటిఫికేషన్ వేసినా స్పందన రాలేదని ప్రిన్సిపల్ లావణ్య తెలిపారు. లోపం ఎవరిదైనా బలి అయ్యేది విద్యార్థులే కాబట్టి అధికారులు ఈ సమస్యపై త్వరగా స్పందించాలని విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపించాలని అంటున్నారు.