Telugu News » Trains Rush: పండక్కి ఊరెళ్లడం కష్టమే.. రైళ్లన్నీ ఫుల్..!

Trains Rush: పండక్కి ఊరెళ్లడం కష్టమే.. రైళ్లన్నీ ఫుల్..!

ఈ సారి సంక్రాంతి పండక్కి ప్రజలకు భారం కానుంది. సంక్రాంతి పండుగకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ అప్పుడే ట్రైన్‌ రిజర్వేషన్ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ప్రస్తుతం ఉన్న డిమాండ్ కారణంగా స్పెషల్ ట్రైన్స్ ఏ మాత్రం సరిపోవడం లేదు.

by Mano
Trains Rush: It is difficult to travel to the festival.. All the trains are full..!

తెలుగు రాష్టాల్లో సంక్రాంతి పండుగ(Sankranti Festival) సందడి అంతా ఇంతా కాదు.. ఏపీలో ఆ సందడి వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పవచ్చు. రంగు రంగుల ముగ్గులు, పిండివంటలు, కోడి పందాలు, హరిదాసుల కీర్తనలతో వైభవంగా నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో ఉంటూ చదువుకునే విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునే వారు సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ముందుగానే బస్సులు, ట్రైన్లలో టికెట్ల (Train Tickets)ను బుక్ చేసుకుంటారు.

Trains Rush: It is difficult to travel to the festival.. All the trains are full..!

అయితే, ఈ సారి సంక్రాంతి పండక్కి ప్రజలకు భారం కానుంది. సంక్రాంతి పండుగకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ అప్పుడే ట్రైన్‌ రిజర్వేషన్ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ప్రస్తుతం ఉన్న డిమాండ్ కారణంగా స్పెషల్ ట్రైన్స్ ఏ మాత్రం సరిపోవడం లేదు. జనవరి 10 నుంచి 20 వరకు రాకపోకలకు ఏ రైలులోనూ బెర్తులు లేవు. అన్నింటిలోనూ వెయిటింగ్‌ లిస్ట్ ఉంది. దీంతో బోగీల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ప్రధాన రైల్వే స్టేషన్లలో టికెట్ రిజర్వేషన్ కోసం వెళితే ఏ రైలుకైనా వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్టులు, కొన్ని రైళ్లను రిగ్రెట్ అని కూడా వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఉత్తరాంధ్ర వైపు వెళ్లే రైళ్లకు రెండు నెలల ముందే రిజర్వేషన్లు పూర్తయినట్లు తెలుస్తోంది. దక్షిణమధ్య రైల్వే ప్రయాణికుల కోసం కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నా అవి ఏమాత్రం సరిపోవడంలేదని తెలుస్తోంది.

ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమండ్రి ప్రాంతాలకు రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. లాంగ్ వెయిటింగ్ లిస్ట్ ఉన్నా ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో రిజర్వేషన్ వస్తుందనే ఆశతో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. గోదావరి, ఫలక్ నుమా, విశాఖ వందే భారత్, గరీబ్ రథ్ రైళ్లలో రిజర్వేషన్ లేకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, రైళ్లు ఫుల్ అవడంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు రెచ్చిపోతున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అధిక ధరలకు టికెట్లను అమ్ముకుంటున్నాయి. దీంతో సంక్రాంతి పండుగకు ప్రయాణం సామాన్యుడికి మరింత భారం కానుంది.

You may also like

Leave a Comment