అయోధ్య (Ayodhya)లో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈమేరకు హైదరాబాద్ (Hydreabad)లోని, బషీర్ బాగ్ (Bashir Bagh) అమ్మవారి ఆలయంలో నేటి ఉదయం 9 గంటలకు స్వచ్ఛత కార్యక్రమం చేపట్టారు.. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం ఉదయం 11 గంటలకు ఫిజీ ఉప ప్రధానమంత్రి, పర్యాటక, పౌర విమానయాన శాఖ మంత్రి విలియమ్ గవోకాతో.. బంజారాహిల్స్ తాజ్ కృష్ణ లో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి (Kishan Reddy).. కేంద్రం చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని.. మూడోసారి ప్రధానిగా మోడీ ఎన్నిక ఖాయమని పేర్కొన్నారు.
ప్రతి ఇంటికి మూత్రశాలలు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత బీజేపీ (BJP)కే దక్కుతుందని తెలిపిన కిషన్ రెడ్డి.. కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పడం లేదని ఆరోపించారు.. అందుకే బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం ఎలాంటి పథకాలు తీసుకొచ్చిందో తెలిపేందుకే వికసిత్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
దేశంలో ఏ పార్టీకి బీజేపీని ఓడించే శక్తి లేదని, రానున్న ఎన్నికల్లో పార్టీ మెజారిటీ సీట్లు సాధించి, కేంద్రంలో అధికారం చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అవినీతిరహిత పాలన కోసం బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు. మరోవైపు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా.. నిన్న కాచిగూడ, నింబోలి అడ్డాలో సైతం పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు..