Telugu News » Sudha Murty : రాజ్యసభకు సుధామూర్తి నామినేట్.. ట్వీట్ చేసిన ప్రధాని..!

Sudha Murty : రాజ్యసభకు సుధామూర్తి నామినేట్.. ట్వీట్ చేసిన ప్రధాని..!

ఎందరికో ఆదర్శంగా నిలిచిన సుధామూర్తి రాజ్యసభలో ఉండటం నారీశక్తికి నిదర్శనమని తెలిపారు. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ అని అన్నారు.

by Venu

ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) రాజ్యసభకు (Rajya Sabha) నామినేట్‌ అయ్యారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ (PM Modi) ట్విట్టర్ (X) ద్వారా వెల్లడించారు.. మహిళా దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేసిన ప్రధాని.. సామాజిక సేవ, విద్యసహా పలు అంశాల్లో ఆమె స్ఫూర్తిదాయక ముద్ర వేసినట్లు పేర్కొన్నారు.

ఎందరికో ఆదర్శంగా నిలిచిన సుధామూర్తి రాజ్యసభలో ఉండటం నారీశక్తికి నిదర్శనమని తెలిపారు. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ అని అన్నారు. తన బాధ్యతను పూర్తిస్థాయిలో ఆమె నిర్వర్తిస్తారని ఆశిస్తున్నట్లు మోడీ వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటం విశేషం. మరోవైపు రాజ్యసభకు నామినేట్‌ అవడంపై సుధామూర్తి ఆనందం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం థాయ్‌లాండ్‌ పర్యటనలో ఉన్న ఆమె పీటీఐతో ఫోన్‌లో మాట్లాడారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన రావడం డబుల్‌ సర్‌ప్రైజ్‌గా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. నిజానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఏనాడూ పదవులు కోరుకోలేదు. ప్రభుత్వం నన్ను ఎందుకు ఎంపిక చేసిందో తెలియదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మూర్తి ట్రస్ట్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న 73 ఏళ్ల సుధామూర్తి.. రచయిత్రిగా, విద్యావేత్తగా, వితరణశీలిగా దేశవ్యాప్తంగా సుపరిచతమే.

ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. పలు అనాథాశ్రయాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. అదీగాక కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్‌, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా కేంద్రం 2006లో పద్మశ్రీ,.. 2023లో పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది.

You may also like

Leave a Comment