ఎన్నికల అధికారుల నియామకంపై రూపొందించిన కొత్త చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు (Supreme Court) నిరాకరించింది. కానీ కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అంగీకారం తెలిపింది. ఈ చట్టం ఎంత వరకు చెల్లుబాటు అవుతుందో తెలుసుకునేందుకు కేంద్రంతో పాటు ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసు(Notice)లు జారీ చేసింది.
ఈ నోటీసులపై ఏప్రిల్ లోగా స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇటీవల ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను నియమించే ప్యానెల్ నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని మినహాయిస్తూ కేంద్రం చట్టం తీసుకు వచ్చింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ జయాఠాకూర్ సుప్రీం కోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. కేంద్రం తీసుకు వచ్చిన ఈ చట్టం అధికార విభజనకు వ్యతిరేకంగా ఉందని ఆమె తరఫు న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు.
అందువల్ల స్టే విధించాలని ఆమె తరఫున న్యాయవాది వికాస్ సింగ్ కోరారు. చట్టబద్ధంగా చేసిన రాజ్యాంగ సవరణపై తాము స్టే ఇవ్వలేమని తెలిపింది. కానీ ఈ చట్టం కేంద్రం వాదన ఎలా ఉందో తెలుసుకోకుండా స్టే విధించలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేస్తున్నట్టు వెల్లడించింది.
ఇటీవల భారత ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొత్త చట్టం తీసుకు వచ్చింది. దీని ప్రకారం… ప్రధాన మంత్రి, లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఒక కేంద్ర మంత్రిలతో కూడిన ప్యానెల్ సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్లను నియమించనుంది. గతంలో ఈ ప్యానెల్లో సీజేఐ కూడా సభ్యులుగా ఉండగా తాజా చట్ట ప్రకారం సీజేఐని మినహాయించారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.