రాష్ట్రంలో విద్యార్థినిల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న పలు హాస్టల్లో, గురుకులాల్లో ఉన్న విద్యార్థినిలు బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఇలా జరుగుతున్న ఘటనల్లో అసలు విషయం పూర్తి క్లారిటీగా బయటకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అదీగాక విద్యార్థి సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనల నుంచి కొలుకోకుండానే మరో దుర్వార్త వెలుగులోకి వచ్చింది.
సూర్యాపేట (Suryapet) జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఇమాంపేట (Imampeta) ఎస్సీ గురుకుల పాఠశాల (SC Gurukula School)లో పదో తరగతి చదవుతున్న అస్మిత అనే విద్యార్థిని తన ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది..
అయితే ఈ నెల 10న అదే గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదవుతున్న విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.. ఈనేపథ్యంలో పాఠశాలలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా ఉండటానికి నాలుగు రోజులపాటు హోం సిక్ సెలవులు ఇచ్చారు. ఈ క్రమంలో అస్మిక తన ఊరు అయిన మోతె (Mote) మండలం బుర్కచర్ల (Burkacherla) గ్రామానికి వెళ్ళింది.
నిన్న ఉదయం రోజు వారిలా ఈమె తల్లి కూలి పనికి వెళ్లింది. తండ్రి వేరే పనినిమిత్తం బయటకి వెళ్లాడాని సమాచారం. వీరిద్దరూ సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని మరణించిన కూతురు కనిపింది. మరోవైపు అస్మిక అదే రోజు స్కూల్‌కు తిరిగి వెళ్లాల్సి ఉన్నది. ఇంతలోనే విగత జీవిగా మారింది. దీంతో అస్మిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.