బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్ సిటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అత్యంత అద్బుతంగా డెవలప్ చేశామన్నారు. మంచి రాజకీయ నాయకుల వల్లే మంచి అభివృద్ధి సాధ్యం అవుతుందని మంత్రి తెలిపారు.
హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో సింజీన్ సైంటిఫిక్ సొల్యూషన్స్ న్యూ క్యాంపస్‌కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన….గత రెండేండ్ల కాలంలో రాష్ట్రంలో లైఫ్ సైన్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం లైఫ్ సైన్సెస్ కు హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు.
త్వరలో లైఫ్ సైన్సెస్ వర్శిటీని ప్రారంభిస్తామన్నారు. ఏడున్నర ఎకరాల్లో సింజీన్ సైంటిఫిక్ సొల్యూషన్స్ కంపెనీని విస్తరిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో కంపెనీ విస్తరణ కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తామని వెల్లడించారు.
యూరప్‌తో పోల్చుకుంటే భారత్ లో లేబర్ ఛార్జీలు చాలా వరకు తక్కువగా వుంటాయని అన్నారు. హైదరాబాద్‌లో రూ. 788 కోట్ల పెట్టుబడులు పెడుతున్నందుకు సింజీన్ కంపెనీకి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగాల్లో సింజీన్ సైంటిఫిక్ సొల్యూషన్స్ చాలా ముఖ్యమైన కంపెనీ అని వివరించారు.