కేసీఆర్ (KCR)కు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజలపై లేదని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం ఏమిచ్చిందో గన్ పార్క్ వద్ద కేసీఆర్ తో చర్చకు తాను సిద్దమని సవాల్ చేశారు. ప్రధాని మోడీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ రావడం లేదంటూ ఆయన మండిపడ్డారు. అలాంటి సీఎం తెలంగాణకు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. పసుపు బోర్డ్ పై వెయిట్ అండ్ సీ అన్నారు. దున్నపోతుకు గడ్డి వేసి ఆవుకు పాలు పిండితే ఫలితం ఉండదన్నారు. తనకు సీఎం కేసీఆర్, కేటీఆర్ లనుంచి ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. తాను ట్రిపుల్ ఆర్ తీసుకువచ్చానని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ కూడా చేయడం లేదన్నారు.
అక్టోబర్ 1న రూ. 13,545 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని వెల్లడించారు. కాచిగూడ-రాయచూర్ డెమో సర్వీస్ ప్రారంభం కానున్నట్టు చెప్పారు. జక్లేర్ టు కృష్ణా కొత్త రైల్వే లైన్ ను ప్రజలకు ప్రధాని అంకితమివ్వనున్నట్టు తెలిపారు. ఈ రైల్వే లైన్ వల్ల గోవా నుంచి హైదరాబాద్ 120 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు.
రూ. 6,404 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. రూ. 2,661 కోట్ల వ్యయంతో నిర్మించిన హసన్-చర్లపల్లి హెచ్పీసీఎల్ పైప్ లైన్ ను జాతికి అంకిమిస్తారన్నారు. తెలంగాణ-నెల్లూరు కృష్ణపట్నం మధ్య రూ. 932 కోట్లతో మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ నిర్మాణం చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్కూల్ ఆఫ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ భవనాలను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభిస్తారన్నారు.
వచ్చే నెల 3న ప్రధాని మోడీ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రూ. 8,021 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభించనున్నట్టు వివరించారు. ఎన్టీపీసీ ప్రాజెక్ట్ మొదటి దశలో 800మెగావాట్ల ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారన్నారు. 680 మెగావాట్లు తెలంగాణ అవసరాలకే ఉపయోగిస్తామన్నారు. రెండోదశ 800 మెగావాట్ల ప్లాంట్ ను వచ్చే డిసెంబర్ కల్లా అందుబాటులోకి వస్తుందన్నారు.