తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) కోసం కాంగ్రెస్ నుంచి రెండో జాబితా(Congress Secound List) విడుదల అనంతరం ఆ పార్టీ నుంచి అసమ్మతి వాదం మెల్లగా బయటికి వస్తోంది. ఇప్పటికే చాలాచోట్ల కాంగ్రెస్ పార్టీలో టికెట్ల రభస మొదలైంది.
కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టులో 55 మంది పేర్లు, రెండో లిస్టులో 45 మంది పేర్లను ప్రకటించగా మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులను కేటాయించారు. మరో 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ప్రకటించిన 45 స్థానాల్లో దాదాపు సగానికి పైగా స్థానాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధితో పాటు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో పలువురు పార్టీకి రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
తనకు మునుగోడు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన చలమల కృష్ణారెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని చూస్తున్నట్లు సమాచారం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి జంగా రాఘవరెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. ఈ క్రమంలో ఆయనకు కాకుండా నాయిని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన కంటతడి పెట్టారు. ఆయన బీఆర్ఎస్లోకి వెళ్తారని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తారని చర్చించుకుంటున్నారు.
పరకాల టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత ఇనగాల వెంకట్రామ్రెడ్డి, జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి నిరాశపడిన పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, మునుగోడు టికెట్ ఆశించిన చెలమల కృష్ణారెడ్డిలు నిరాశలో ఉన్నారు. వీరిలో కృష్ణారెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంటి పోటీకి దిగబోతున్నట్లు ప్రకటించారు. వీటన్నిటి దృష్ట్యా అధిష్టానం ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.