షాజహాన్ తన భార్య కోసం ఎంతో ప్రేమతో నిర్మించిన తాజ్‌మహల్(Tajmhal)ను ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా చూడాలి అనుకుంటారు. ఆగ్రా(Agra)లోని ఈ అపురూపమైన స్మారకాన్ని సందర్శించేందుకు దేశ విదేశీ టూరిస్టులు వస్తుంటారు. అయితే ఇక్కడికి వచ్చే టూరిస్టులను భద్రతా సిబ్బంది పట్టించుకోవడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం.
తాజ్ మహల్ వద్ద అనారోగ్యంతో ఉన్న తండ్రి ప్రాణాలను ఓ సైనికుడు కాపాడుకున్నాడు. ఢిల్లీకి చెందిన రాంరాజ్ అనే వ్యక్తి కుమారుడు ఆర్మీలో పనిచేస్తున్నాడు. అయితే రాంరాజ్ తన కుమారుడితో కలిసి బుధవారం తాజ్‌మహల్‌కు వచ్చాడు. ఈ క్రమంలో రాంరాజ్‌కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
దీంతో రాంరాజ్ కుమారుడు వెంటనే సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. సుమారు గంటపాటు ఆగకుండా నిరంతరాయంగా ప్రయత్నించిన తర్వాత రాంరాజ్‌కు శ్వాస తిరిగి వచ్చింది. అనంతరం అతడిని సదర్లోని మిలటరీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది ఏమాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
సీపీఆర్ చేస్తుండగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదివరకు తాజ్‌మహల్ వద్ద ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సకాలంలో వైద్యం అందక ఓ ఫ్రెంచ్ మహిళా పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయింది. ఆ ఘటన తర్వాత సీఐఎస్ఎఫ్, పురావస్తు శాఖ సిబ్బంది ఆదేశాలతో కొద్దిరోజులు అప్రమత్తమైనా ప్రస్తుతం పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.