ఏ శుభకార్యం జరిగినా తొలి పూజ వినాయకుడికే. అటువంటి విఘ్నేశ్వరుడ్ని (Lord Ganesh) ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారత్ (Bharat) లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను చేస్తుంటారు. ఈసారి కూడా ఆదిపూజ్యుడైన వినాయకుడిని వాడవాడలా ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు భక్తులు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా గణేశ్ ఉత్సవాలను ఎంతో వైభవంగా జరుపుతున్నారు. బుధవారం నుంచి నిమజ్జన కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
హైదరాబాద్ (Hyderabad) లో గణేష్ నిమజ్జనం అనగానే ఎంతో కోలాహలంగా ఉంటుందో తెలుసు. వాడవాడలా ఏర్పాటు చేసిన వినాయకులు హుస్సేన్ సాగర్ తీరానికి వస్తుంటాయి. ఈసారి కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో నెక్లెస్ రోడ్ లో నిమజ్జన ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) పరిశీలించారు. జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్ రొనాల్డ్ రోస్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని.. బుధవారం నుంచి గణేష్ నిమజ్జనం మొదలు అవుతుందని.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 90వేల వినాయక విగ్రహాలు ఉన్నాయని చెప్పారు. ఎవరు ఎక్కడ నిమజ్జనం చేయాలో అందరికీ సమాచారం అందించామన్నారు. ఉత్సవ సమితి సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను ఈసారి మరింత పెంచామన్న తలసాని.. ఎవరూ అపోహలు నమ్మొద్దని కోరారు. ప్రశాంతంగా నిమజ్జనం జరిగేలా అందరూ సహకరించాలని అన్నారు.