ప్రతిపక్షాలు కళ్లుండి చూడలేని పరిస్థితుల్లో ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ (KCR Vision) ఉన్న నాయకుడని.. ఈ పనికిరాని చెత్త ప్రతిపక్ష పార్టీలు (Opposition parties) పని లేని విమర్శలు చేస్తూనే ఉంటాయని ఆయన ఆరోపించారు. బుధవారం మర్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్‌లో 14 లక్షల 35 వేల చేప పిల్లలను మంత్రి వదిలారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు.
గత ప్రభుత్వాలు మత్స్యకారులు ఉన్నారనే విషయం మరిచాయని, వంద శాతం ఉచితంగా తెలంగాణా ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేస్తుందని చెప్పారు. చేపలు పట్టుకునే వారికి 4 లక్షల ఐడీ కార్డులు.. వేయి కోట్ల రూపాయలతో వాహనాలు, జాలరులకు రైన్ కోర్టులను ప్రభుత్వం అందించిందన్నారు.
18 సంవత్సరాలు నిండిన వారందరికీ మెంబర్షిప్ ఉండాలనేది ప్రభుత్వం లక్ష్యమని…ఇలాంటి కార్యక్రమాలు కొంత మందికి కనిపించవని మండిపడ్డారు. కొండ పోచమ్మలో నీళ్లు లేకపోయినా, అనవసరంగా కట్టారని కొంతమంది ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని…ఇది అన్యాయమని మంత్రి తలసాని అగ్రహాం వ్యక్తం చేశారు.
చేపలులో అనేక ప్రొటీన్లు ఉంటాయని…మటన్, చికెన్ కంటే చేపలతోనే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చెపుతున్నారన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయడమంటే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడమేనని అన్నారు.