సికింద్రాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాక్ ల్యాండ్ అవెన్యూ భూముల కబ్జా విషయంలో ఎమ్మెల్యే హన్మంత రావుకు బీజేవైఎం నేతలకు మధ్య ఘర్షణ నెలకొంది. రాక్ ల్యాండ్ అవెన్యూ కార్యాలయం వద్దకు జేసీబీతో వెళ్లేందుకు బీజేవైఎం నేతలు ప్రయత్నించారు. దీంతో బీజేవైఎం నేతలపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు.
ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం…. సికింద్రాబాద్ లోని రాక్ ల్యాండ్ అవెన్యూలో భూములను మైనంపల్లి వర్గీయులు కొందరు కబ్జా చేశారని బీజేవైఎం నేతలు ఆరోపించారు. ఆ స్థలంలోనే ఎమ్మెల్యే భవనాలు కట్టారని ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు కబ్జాలను బయటపెట్టేందుకు బీజేవైఎం నేతలు బైక్ ర్యాలీ తీశారు.
అనంతరం బీజేవైఎం కార్యాలయాన్ని హన్మంతరావు వర్గీయులు ధ్వంసం చేశారు. మరోవైపు బీజేవైఎం కార్యకర్తలు కూడా రాక్ల్యాండ్ అవెన్యూ కార్యాలయంపై దాడి చేశారు. రాక్ అవెన్యూ కార్యాలయ అద్దాలను బీజేవైఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతరం జేసీబీతో రాక్ ల్యాండ్ అవెన్యూ కార్యాలయ కమాన్ ను జేసీబీతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో బీజేవైఎం నేతలను మైనం పల్లి కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆ సమయంలో ఎమ్మెల్యే అనుచరులు అక్కడకు చేరుకుని బీజేవైఎం నేతలపై దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు బీజేవైఎం నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.