డబుల్ బెడ్రూం అంశంలో బీజేపీ నిర్వహించిన మహాధర్నాపై బీఆర్ఎస్ (BRS) నేతలు రియాక్ట్ అవుతున్నారు. కేంద్ర నిధులకు సంబంధించి బీజేపీ (BJP) నేతలపై ఎదురుదాడికి దిగుతున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) స్పందిస్తూ.. కళ్లముందన్న డబుల్ బెడ్రూం ఇళ్లను చూడలేని కబోది పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అని విమర్శించారు. బీజేపీ ఆఫీస్ పక్కనే ఇళ్లున్నాయని.. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలంగాణ (Telangana) కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకునే గొప్ప మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ (KCR) అని తెలిపారు తలసాని. కాంగ్రెస్, బీజేపీ నేతలు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మాయమాటలతో ఇరు పార్టీల నేతలు ప్రజల్లోకి వస్తున్నారని అన్నారు. డ్రామాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వారి ట్రాప్ లో పడొద్దని సూచించారు.
దళితబంధు పథకం రానున్న రోజుల్లో దేశాన్నే కదిలిస్తుందని జోస్యం చెప్పారు మంత్రి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలని డిమాండ్ మొదలైందన్నారు. 45 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావును విమర్శించడం దయ్యాలు వేదాలను వల్లించినట్లే ఉందని విమర్శించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు తలసాని. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సంక్షేమ గురుకుల పాఠశాలలు, పేదలకు ఇళ్లు, వెనుకబడిన తరగతుల సమాజానికి ఆర్థిక సహాయ కార్యక్రమం, ఆరోగ్య లక్ష్మి, దళితబంధు లాంటి పథకాలు తెలంగాణలో తప్ప మరెక్కడా లేవని వివరించారు.