ఆ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకూ చెప్పారు.. అయితే అందుకు యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఒకరినివిడిచి మరొకరు ఉండలేని వారు.. స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇది జీర్ణించుకోలేని యువతి కుటుంబసభ్యులు ఆ కొత్తజంటను అమానుషంగా హతమార్చారు.
ఈ దారుణ ఘటన తమిళనాడులోని తూత్తుకూడి జిల్లాలో కలకలం రేపింది. యువకుడు వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడికి చెందిన కార్తీక (20), సేల్వం (24) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే యువకుడు వేరే కులానికి చెందిన వాడని కార్తీక కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించారు.
దీంతో చేసేది లేక ఆ ప్రేమజంట అక్టోబరు 31న ఇంటి నుంచి వెళ్లిపోయింది. కార్తీక, సేల్వం మూడురోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లయినప్పటి నుంచి మురుగేషన్ నగర్లో వారు ఉంటున్నారు. కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని కార్తీక కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. కొత్త జంట కార్తీక, సేల్వం తూత్తుకూడిలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆరుగురు యువకులు లోపలి చొరబడ్డారు. కార్తీక, సేల్వంను దారుణంగా చంపి పరారీ అయ్యారు.
విషయం తెలిసిన సేల్వం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కార్తీక తల్లిదండ్రులపై అనుమానం వ్యక్తం చేస్తూ.. సేల్వం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బాలాజీ, రూరల్ డిప్యూటీ సూపరింటెండెంట్ సురేశ్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.