తెలంగాణ (Telangana)లో ఓటర్లు ఊహించిందే జరిగింది.. బీఆర్ఎస్ (BRS)తో పొత్తు కుదురుతుందని కామ్రేడ్లు ఎన్నో కలలు కన్నారు. అది వర్కవుట్ కాకపోవడంతో.. కాంగ్రెస్ (Congress) పంచన చేరారనే టాక్ రాష్ట్రంలో ఒక ఊపు ఊపింది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తాము చట్ట సభల్లోకి అడుగుపెడతామని ధీమాతో ఉన్న కమ్యునిస్టులు (Communists) కాంగ్రెస్ తో పొత్తు ఖాయం చేసుకున్నారు.
కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. సీట్ల సర్దుబాటు విషయంలో తేడాలు రావడంతో వామపక్ష పార్టీలు నిరాశకు గురయ్యాయి. మరోవైపు కాంగ్రెస్ మాత్రం చూద్దాంలే అనే తీరుగా వ్యవహరించడంతో కామ్రేడ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు లేదని సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) స్పష్టం చేశారు.
వచ్చే రెండు, మూడు రోజుల్లో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని వివరించారు. అనివార్య పరిస్థితుల్లో సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ప్రజలకు మేలు జరగాలంటే కమ్యూనిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని తమ్మినేని అభిప్రాయపడ్డారు. మరోవైపు సీట్ల విషయంలో కాంగ్రెస్ మాట మార్చిందని తమ్మినేని ఆరోపించారు. తాము కోరిన స్థానాలకు కాంగ్రెస్ అభ్యంతరం తెలిపిందని వెల్లడించారు. కాంగ్రెస్ నేతల వైఖరి.. తమ పార్టీ నేతలను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు..