రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) అవినీతిని నిరూపిస్తానని పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు సవాల్ చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ప్రస్తుతం కనబడకుండా మాయం అవుతోన్న ఫైల్స్ వెనక ఉన్న మర్మమేంటి? అనే అనుమానం రాష్ట్ర ప్రజల్లో మొదలైందనే టాక్ వినిపిస్తోంది.
తాజాగా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర పనిచేసిన, ఓఎస్డీ కళ్యాణ్ కార్యాలయంలో కొన్ని దస్త్రాలు మాయమయ్యాయి. కిటికీ గ్రిల్స్ తొలగించి దుండగులు ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు కార్యాలయం వాచ్‌మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై డీసీపీ శ్రీనివాస్ స్పందించారు. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఓఎస్డీ కళ్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్‌లపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం..
మరోవైపు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో మాజీమంత్రులు, ప్రజాప్రతినిధులు, ఓఎస్డీ కార్యాలయాల్లోకి ఆగంతకులు ప్రవేశించి, కీలక పత్రాలు మాయం చేయడం సంచలనంగా మారింది. ఇటీవలే హిమాయత్‌నగర్‌లోని పర్యాటక అభివృద్ధి కార్యాలయంలో (Tourism Development Office) అగ్నిప్రమాదం జరగడం, రవీంద్ర భారతి నుంచి ఫర్నీచర్ అక్రమ తరలింపు.. సాంకేతిక విద్యామండలి కార్యాలయంలోకి ప్రవేశించిన ఇద్దరు కొన్ని పత్రాలతో పారిపోతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
వరుసగా జరుగుతోన్న ఈ ఘటనలపై పోలీసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.. రాష్ట్రంలో భారీ స్కామ్ చేసి ఆ భయంతోనే ఫైల్స్ మాయం చేస్తున్నట్టు అనుమాన పడుతున్నారు.. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా రాత్రివేళ కార్యాలయంలోకి ప్రవేశించే వారిపై చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు దస్త్రాల మాయం వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్, డీజీపీ (DGP) రవిగుప్తాకు లేఖ రాశారు.