హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా (RERA) డైరెక్టర్‌గా ఉంటూ అక్రమ సంపాదనతో ఎదిగిన శివబాలకృష్ణ (Shiva Balakrishna) అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన ఆయనపై ఏసీబీ (ACB) కస్టడీ కొనసాగుతోంది. విచారణలో భాగంగా కస్టడీకి తీసుకొన్న అధికారులు బినామీల బ్యాంకు లాకర్లపై ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గతంలో శివ బాలకృష్ణతో పాటు పని చేసిన హెచ్ఎండీఏ (HMDA), రెరాలోని ఉద్యోగులను వరుసగా కార్యాలయానికి పిలిపించుకొని వివరాలు సేకరిస్తున్నారు. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు వరుసగా ఐదో రోజు కూడా ప్రశ్నించారు. ఇప్పటివరకు సేకరించిన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను శివ బాలకృష్ణ ముందు పెట్టి విచారణ చేస్తున్నారు.
ఇందులో భాగంగా హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా, రెరా ఇన్ఛార్జ్ సెక్రటరీగా శివ బాలకృష్ణ ఉన్నప్పుడు ఎన్ని రియల్వెంచర్లకు అనుమతులు ఇచ్చారు?.. అన్ని నిబంధనలకు అనుగుణంగానే పర్మిషన్లు ఇచ్చారా? లేక అక్రమాలకు పాల్పడ్డారా? అన్న వివరాలు సేకరిస్తున్నారు. ఇదంతా కూడా బాలకృష్ణ ఇచ్చిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను తెప్పించుకుని మరీ ఏసీబీ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
అయితే విచారణలో తాము పై అధికారులు చెప్పినట్టు చేశామని కొందరు సిబ్బంది సమాధానమిచ్చినట్టు తెలిసింది. కాగా, ఏసీబీ అధికారులు ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తుండటంతో.. హెచ్ఎండీఏ, రెరాలో పని చేస్తున్న సిబ్బందిలో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. చివరికి ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందో అనే భయంలో ఉద్యోగులున్నట్లు తెలుస్తోంది.