తెలంగాణ (Telangana) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గత ప్రభుత్వం హయాంలో చేసినతప్పులు.. ప్రస్తుతం కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలపై చర్చలు జోరుగా నడుస్తున్నాయి. వీటికంటే ముందు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. స్పీకర్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది. సభ ప్రారంభానికంటే ముందు స్పీకర్ సభలోని సభ్యుల అభివాదాలు స్వీకరిస్తూ.. తన చైర్ వైపునకు వస్తున్నారు.
ఈ సమయంలో సభలో ఉన్న కొందరు మా దిక్కు కూడా చూడండి సార్ అన్నారు. ఈ మాటలకు స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad).. తన చూపంతా హరీష్ రావు (Harish Rao) మీదనే ఉందన్నారు. ఈ మాటలకు హరీష్ రావు బదులిస్తూ, చూపులతో గుచ్చి గుచ్చి సంపకండి సార్ అని వ్యాఖ్యానించారు. వీరిద్దరి సంభాషణతో ఒక్క సారిగా అసెంబ్లీలో నవ్వులు మోగాయి..
అదీగాక మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు (Shridhar Babu) సైతం ఈ ఘటనతో నవ్వుకోవడం వీడియోలో కనిపించింది. ఇదిలా ఉండగా.. తెలంగాణ ఇరిగేషన్ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో అన్నీ అబద్ధాలే ఉన్నాయని హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన ప్రజెంటేషన్‌లో సత్యదూరమైన విషయాలున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
కేవలం బీఆర్ఎస్ మీద బురద జల్లేందుకు ఈ ప్రజెంటేషన్ ఇచ్చారని విమర్శించారు. తమ ప్రభుత్వం రూ.775 కోట్లు కేటాయించి మిడ్ మానేరు, ఎల్లంపల్లి పూర్తి చేసిందని వెల్లడించారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై పపవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే సమయంలో ఓ టెక్నీషియన్ సభలోకి వచ్చాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన హరీష్ రావు.. అడ్వకేట్ జనరల్ తప్ప మరో వ్యక్తి రావొద్దని.. టెక్నీషియన్‌ను సభలోకి అనుమతించవద్దని.. మంత్రి మాత్రమే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు.