ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు స్కామ్ ల చుట్టూ తిరుగుతున్నాయని అనుకొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా అవకతవకలు జరిగినట్లుగా ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ దిశగా విచారణలు సైతం చేపట్టినట్లు ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) మెడకు మరో భారీ కుంభకోణం చుట్టుకొనేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.
విద్యుత్ కేంద్రాల నిర్మాణం.. ఛత్తీస్‌గఢ్ ఒప్పందాల్లో అవకతవకల్ని బయట పెట్టేందుకు సైలెంట్ గా విచారణ జరుగుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ విషయంలో తన పనిని ప్రారంభించిందని తెలుస్తోంది. గత ప్రభుత్వం కాంపిటీటివ్ బిడ్డింగ్‌కు వెళ్లకుండా నామినేషన్ల ప్రాతిపదికన పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడంపై దృష్టి సారించినట్లుగా ప్రచారం జరుగుతుంది.
మరోవైపు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్ డిస్కంల నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై న్యాయ విచారణ జరిపేందుకు పాట్నా (Patna) హైకోర్టు (High Court) రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి (Retired Chief Justice L Narasimha Reddy)ని ‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ’గా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం నియమించిందని టాక్ వినిపిస్తుంది..
ఈ నేపథ్యంలో ఎవరైనా కమిషన్ దృష్టికి సమాచారం, సాక్ష్యాలు, ఆధారాలను తీసుకురావచ్చని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ ఈ అవినీతితో సంబంధం ఉందని కమిషన్ భావిస్తే.. వారు ఎంత పెద్దవారైన చివరికి మాజీ ముఖ్యమంత్రి అయినా సరే.. విచారణకు పిలుస్తామని తెలిపారు. ముందుగా రిక్వెస్ట్ లెటర్స్ రాస్తామనీ, వాటికి స్పందించకుంటే సమన్లు పంపుతామని స్పష్టం చేశారు. అదేవిధంగా మూడు ఒప్పందాలకు సంబంధించిన ఫైళ్లను ఇప్పటికే స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు.
ఇదిలా ఉండగా.. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికే అనేక రకాల విచారణలు జరుగుతున్న విషయం తెలిసిందే.. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. భారీ స్కాములపై దృష్టి సారించింది. ఈ క్రమంలో బయటికి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చాంశనీయంగా మారింది. ప్రస్తుతం ఈ కేసులో చివరికి గులాబీ పెద్దలకు చిక్కులు తెచ్చిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదనే టాక్ మొదలైంది..