Telugu News » Telangana : అసెంబ్లీ యుద్ధానికి రెడీ.. నెగ్గేదెవరు..?

Telangana : అసెంబ్లీ యుద్ధానికి రెడీ.. నెగ్గేదెవరు..?

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అసెంబ్లీలో సీఎం కుర్చీలో కేసీఆర్ కూర్చున్నారు. అప్పుడు టీడీపీ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుల మధ్యలో ఎక్కడో చివరిలో కనిపించారు. అయితే.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇన్నాళ్లూ సీఎం హోదాలో కేసీఆర్ కూర్చున్న స్థానంలో రేవంత్ రెడ్డి.. ప్రతిపక్ష నాయకుడిగా గులాబీ బాస్ అసెంబ్లీలో కనిపించనున్నారు.

by admin
Telangana Assembly Budget Sessions 2024

– రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
– మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక రివ్యూ
– అసెంబ్లీ కమిటీ హాల్ లో ప్రభుత్వ విప్ లతో చర్చ
– తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
– మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క
– ఇరిగేషన్ శాఖపై వైట్ పేపర్ విడుదలకు ఛాన్స్
– సభ ముందుకు మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక
– బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేలా కాంగ్రెస్ ప్లాన్స్
– ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్
– ఇప్పటికే ఇరు పార్టీల మధ్య ప్రాజెక్టుల పంచాయితీ
– అసెంబ్లీ సాక్షిగా మాటల యుద్ధానికి అవకాశం

తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమరానికి సమయం ఆసన్నమైంది. గురువారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొదటి రోజు గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్.. మొదటి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల నిర్వహరణపై సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో ప్రభుత్వ విప్ లతో చర్చించారు. ఈ సమావేశాల్లోనే ఇరిగేషన్ శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ నివేదికను సభలో వివరించనుంది. ఇప్పటికే కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడం.. ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అడుగు పెడుతుండడంతో.. సభలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అనేది ఆసక్తికరంగా మారింది.

Telangana Assembly Budget Sessions 2024

ఇరిగేషన్ పై శ్వేతపత్రం

అధికారం చేపట్టాక అన్ని శాఖలపై సమీక్షలు జరిపిన ప్రభుత్వం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఓ అంచనాకొచ్చి శ్వేతపత్రం విడుదల చేసింది. అప్పుల చిట్టాను శీతాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివరించింది. ఇప్పుడు బడ్జెట్ సెషన్ లో ఇరిగేషన్ శాఖపై వైట్ పేపర్ విడుదలకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఇరిగేషన్​ ప్రాజెక్టుల కోసం రూ.1.82 లక్షల కోట్లు ఖర్చు చేసింది. దాదాపు 17 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందాయి. కానీ, కేసీఆర్ సీఎం అయిన తర్వాత చేపట్టిన ప్రాజెక్టుల కింద లక్ష ఎకరాల్లోపే కొత్త ఆయకట్టు వచ్చిందని, మిగతా 16 లక్షల ఎకరాల ఆయకట్టు జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్​ తలపెట్టిన ప్రాజెక్టుల కిందనే వచ్చిందని అంటోంది. ఈ మేరకు ఇరిగేషన్​ శాఖ శ్వేతపత్రం సిద్ధం చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.93,872 కోట్లు ఖర్చు చేసినా కొత్తగా 98 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని అధికారులు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్​ స్కీంకు రూ.37,514 కోట్లు, సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ​ప్రాజెక్టుకు కలిపి రూ.8,634 కోట్లు, డిండి లిఫ్ట్​ స్కీంకు రూ.2,987 కోట్లు, చనాఖా-కొరాటాకు రూ.1,093 కోట్లు, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.399 కోట్లు, మోడికుంటవాగు రూ.65 కోట్లు, గట్టు ఎత్తిపోతలకు రూ.119 కోట్లు, జగన్నాథపూర్​ ప్రాజెక్టుకు రూ.192 కోట్లు ఖర్చు చేసినా వాటి కింద ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శ్వేతపత్రంపై అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగే ఛాన్స్ ఉంది.

మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక

బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టింది. దాదాపు లక్ష కోట్ల దాకా ఖర్చు చేసి బ్యారేజీలు, పంప్ హౌస్ లు, ఇతర నిర్మాణాలు చేపట్టింది. అయితే.. వరదల సమయంలో పంప్ హౌస్ లు మునిగిపోవడం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ లోపాలపై ఫోకస్ పెట్టి విజిలెన్స్ విచారణ చేయించింది. దీనికి సంబంధించిన నివేదిక రెడీ అయింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ ముందుకు ఈ నివేదికను తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారం మేరకు మేడిగడ్డ వద్ద నష్టం భారీగానే ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రవాహాన్ని నియంత్రించేందుకు పియర్స్ వెనుక భాగంలో చేసిన కాంక్రీటు నిర్మాణాలు కొట్టుకుపోయాయని నిర్ధారించారు. అన్నారం, సుందిళ్లలోనూ ఇదే తరహా లోపాలకు ఆస్కారం ఉందని సర్కార్​ కు సమాచారం అందినట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో ఈ నివేదికను బయటపెడితే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే ప్రాజెక్టుల అప్పగింతపై వివాదం

కొన్నిరోజుల కిందట హైదరాబాద్ లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీలు, ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు కేఆర్ఎంబీకి అప్పగించాలని ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఈ అంశం తెలంగాణలో రాజీకయ యుద్ధానికి కారణమైంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోపే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విరుచుకుపడింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అసలు పాపం అంతా కేసీఆర్ దేనని.. విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టులు అప్పగించామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సైడ్ నుంచి కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్లు వస్తున్నాయి. నీళ్ల వాటా విషయంలో తెలంగాణ హక్కుల కోసం కొట్లాడతామని కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈనెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై మాటల యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

తొలిసారి ప్రతిపక్ష నేతగా కేసీఆర్.. సీఎంగా రేవంత్

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అసెంబ్లీలో సీఎం కుర్చీలో కేసీఆర్ కూర్చున్నారు. అప్పుడు టీడీపీ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుల మధ్యలో ఎక్కడో చివరిలో కనిపించారు. అయితే.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇన్నాళ్లూ సీఎం హోదాలో కేసీఆర్ కూర్చున్న స్థానంలో రేవంత్ రెడ్డి.. ప్రతిపక్ష నాయకుడిగా గులాబీ బాస్ అసెంబ్లీలో కనిపించనున్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ సభ ముందుకు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలే అవకాశం కనిపిస్తోంది. గత సమావేశాల్లో కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే.. ఈసారి కేసీఆర్, రేవంత్ మధ్య డైలాగ్ వార్ ఎలా ఉంటుందో అనేది సర్వత్రా ఇంట్రెస్టింగ్ గా మారింది.

You may also like

Leave a Comment