తెలంగాణ (Telangana) అంటే ఆత్మ త్యాగాలతో..ఆత్మగౌరవతో ఏర్పడిన రాష్ట్రం. ఎన్నో కలలు.. ఎన్నో ఆశలు తెలంగాణ ప్రజల గుండె చప్పుళ్ళు.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినాక.. రాష్ట్రం బంగారు తెలంగాణ మారి.. అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఆశించారు. కానీ కల్వకుంట్ల కుంటుంబం మాత్రం బంగారు మయంగా మారుతుందని తెలిస్తే అసలు తెలంగాణ ఊసే ఎత్తకపోయే వారు కావచ్చని కొందరి మనసులో మాట..
మరోవైపు బీఆర్ఎస్ బాస్ తో పాటుగా, చిన్న బాస్.. నేతలు, నాయకులు అందరికీ గర్వం మూడో కన్నుగా మారిందని.. అవినీతి ఇంటి పేరుగా మార్చుకున్నారని రాష్ట్ర ప్రజల మాట..అదీగాక.. ప్రజా సంక్షేమం అనే మాట.. కాగితాల వరకే పరిమితం అయ్యి.. ఫక్తు కమర్షియల్ రాజకీయాలు (Commercial politics) బీఆర్ఎస్ (BRS) పాలనలో తెరమీదికి వచ్చాయనే భావన ప్రజల్లో మొదలైంది.
మరోవైపు బెదిరింపులు.. కబ్జాలు.. ధనార్జనే ధ్యేయంగా పాలన సాగుతుందని మధ్యతరగతి వారి ఆవేదన.. ఒకరకంగా పేద వాడు పేదరికంలోకి వెళ్ళగా.. బీఆర్ఎస్ నేతల ఆస్తులుమాత్రం ఊహించని స్థాయిలో పెరగడం తెలంగాణ విద్యావంతులను ఆలోచింపచేసింది. ఈ పదేళ్ళ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం నోటీఫకేషన్స్ ఇచ్చామని చెబుతుందే కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వెల్లడించడం లేదు..పేపరు ప్రకటనలు కడుపునింపవన్న నిజం పాలకులకు తెలియదా? అని నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేస్తే వారిని జైలుపాలు చేశారనే చిచ్చు అగ్నిజ్వాలాగా మారింది..
ఇలా ఒకటేమిటి ప్రభుత్వ వైఫల్యాలు చెప్పుకుంటూ పోతే ఒక వెబ్ సిరీస్ అవుతుందంటున్నారు.. ప్రత్యేక రాష్ట్రంలో బాగుపడింది ఎవరని అడిగితే కల్వకుంట్ల ఫ్యామిలీ.. బీఆర్ఎస్ నేతలని చెడ్డీ తొడగడం కూడా సరిగ్గా రాని పిల్లాడు కూడా చెప్పే స్థాయికి ప్రభుత్వం దిగజారిందని ప్రచారం.. మరోవైపు అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ టీఆర్ఎస్ (TRS)ను.. బీఆర్ఎస్ గా మార్చి రాష్ట్ర రాజకీయాలను వదిలి.. దేశ రాజకీయాల్లో వెలుపెట్టడం.. ఇతర రాష్ట్రాలలో తన రాజకీయ స్వార్థం కోసం డబ్బులు పంచడం..
రాష్ట్రంలో సైకిల్ చెంచాలు.. బెంజ్ కార్లు కొనే స్థాయికి చేరుకోవడం.. కుటుంబ పాలన కొనసాగించాలని.. నామమాత్రంగా మంత్రులను నియమించి అధికారాలన్నీ కల్వకుంట్ల చేతిలో పెట్టుకోవడం.. డబ్బుతో అధికారాన్ని కొనవచ్చనే భావన ఇలా అనేక అనేక కారణాల వల్ల రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని టాక్.. మొత్తానికి సన్నిహితంగా గమనించి.. సైలెంట్ గా బీఆర్ఎస్ పని ఫినిష్ చేశారు ఓటర్లని అనుకుంటున్నారు..