తెలంగాణలో జనసేన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న అంశం ఓ కొలిక్కి వచ్చింది. జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. ఈ మేరకు రెండు పార్టీల అధ్యక్షులు జరిపిన చర్చలలో జనసేన 9 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం తెలిపింది. మరోవైపు హైదరాబాద్‌లో ఈ నెల 7న నిర్వహించనున్న ప్రధాని మోదీ సభకు.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హాజరవుతున్నట్టు సమాచారం.
కాగా జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ నివాసంలో జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఎంపీ లక్ష్మణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అయితే మొదట 11 చోట్ల పోటీ చేయాలని జనసేన భావించినా చివరికి 9 స్థానాలతో సరిపెట్టుకోవడం జనసేన లోని కొందరు నేతలను నిరాశకు గురిచేస్తుందని అనుకుంటున్నారు.
మరోవైపు జనసేన పోటీ చేసే స్థానాల పేర్లను త్వరలో ప్రకటిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా తొమ్మిది స్థానాల్లో పోటీ పై.. పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ (Narendra Modi) అవసరం ఎంతో ఉందని.. అందుకే నరేంద్ర మోదీయే మూడోసారి ప్రధాని కావాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని పవన్ అన్నారు.. కాగా ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ ఆత్మగౌరవ సభకు హాజరు కావాలని పవన్ కల్యాణ్‌ను.. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు కోరగా.. అందుకు ఆయన అంగీకరించినట్టు తెలుస్తుంది.