తెలంగాణ (Telangana)లో రాజకీయాలు గమ్మత్తుగా సాగుతున్నాయి. మొన్నటి వరకు టాప్ గేరులో వెళ్ళిన బీఆర్ఎస్ (BRS)..బ్రేకులు ఫెయిలైన కారులా మారిందనే టాక్ రాష్ట్రంలో వినిపిస్తుంది. అవినీతి పాలను అందినకాడికి గతికిన గులాబీ నేతలు.. అహంకారంతో అధికార పీఠాన్ని దూరం చేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయినా ఇప్పటికీ విజయం ఎవరిని వరిస్తుందనేది టాప్ సీక్రెట్.. కానీ హస్తం అధికారంలోకి వస్తే.. ఊహించినట్టుగానే కొబ్బరి చిప్ప కోసం కోతులు కొట్లాడుకున్న సామెత రిపీట్ అవుతుందనే టాక్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ (Congress) నేతలు ఎన్నికల ప్రచారంలో ఎవరికి వారే సీఎం (CM) అని ప్రకటించుకున్నారు. అలాంటి వారు పార్టీలో అరడజనుకు పైగా ఉన్నారు.
ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే వారు సైలెంట్ గా ఉంటారనే అవకాశం లేదు.. చిన్న చిన్న పదవుల విషయంలోనే రాద్దాంతం చేసిన నేతలు, సీఎం సీటు కోసం ఎంతకైనా వెళ్తారనేది ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డి (Revanth Reddy)..తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కావడంలో కీలక పాత్ర పోషించారనే టాక్ ఉంది. ఇప్పుడు మెజార్టీ వస్తే హైకమాండ్ కూడా.. ఆయనకే సీఎం పదవి ఇస్తుందని ప్రచారం
మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కీలకం కాబట్టి బలమైన నేత సీఎంగా లేకపోతే మొదటికే మోసం వస్తుంది. కానీ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్స్ రేవంత్ నాయకత్వంలో పని చేస్తారా అనే అనుమానం మొదలైంది. ముఖ్యంగా కోమటిరెడ్డి అదే భావనను చాలా సార్లు వ్యక్తం చేశారు. పైగా ఆయన తన అనుచరులకు నల్లగొండలో సీట్లిప్పించుకున్నారు. సోదరుడ్ని పార్టీలోకి తెచ్చారు.
కాంగ్రెస కు అతి తక్కువ మెజారటీ వస్తే తనను సీఎంను చేయమంటారు.. కుదరకపోతే రేవంత్ ను తప్ప ఎవరినైనా చేయమంటారనే టాక్ ఉంది.. ఒకవేళ అధిష్టానం ఒప్పుకోకపోతే తనతో ఉన్న ఎమ్మెల్యేలతో తన దారి తాను చూసుకోవచ్చని అనుమానాలు మొదలైయ్యాయి. ఇతర సీనియర్లు కూడా ఇలాగే ఆలోచిస్తే.. కాంగ్రెస్ కు అగ్నిపరీక్ష ఎదురవుతుందని అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి 70 స్థానాల పైన వస్తే మాత్రం రేవంత్ రెడ్డి విషయంలో సీనియర్లు సర్దుకోక తప్పదు. ఎందుకంటే వారికి మరో ఛాన్స్ లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం..