Telugu News » Secunderabad: బరిలో ఇద్దరు మహిళలు.. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచేదెవరో..?

Secunderabad: బరిలో ఇద్దరు మహిళలు.. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచేదెవరో..?

ఒకవైపు మంచి నాయకునిగా పేరున్న సాయన్న కూతురు.. మరోవైపు తన గళంతో రాష్టాన్ని చైతన్య పరిచిన ఉద్యమ నాయకుడు, ప్రజా యుద్దనౌక గద్దర్ కుమార్తె మధ్య పోటీ తీవ్రమైన ఉత్కంఠకు తెర లేపింది..

by Venu

తెలంగాణ (Telangana)లో ఎన్నికలకు మరికొద్ది సమయం ఉన్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల మధ్య పోరు కీలక మలుపులు తిరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో పోటీ ఉత్కంఠంగా సాగే అవకాశం ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ (Congress)కూడా అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రజా యుద్దనౌక గద్దర్ (Gaddar) కుమార్తె డాక్టర్ జీవీ వెన్నెల (GV-Vennela)కి అసెంబ్లీ టికెట్ కేటాయించింది కాంగ్రెస్ పార్టీ.. కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి వెన్నెల బరిలోకి దిగుతున్నారు.

మరోవైపు కంటోన్మెంట్ నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత (Lasya-Nanditha) బీఆర్ఎస్ (BRS)నుంచి పోటికి దిగుతున్నారు. తన తండ్రి మృతి, మహిళ సెంటిమెంట్‌ లాస్యకు కలివస్తుందనే ధీమాతో గులాబీ బాస్, లాస్య నందితకి టికెట్ కేటాయించినట్టు పార్టీవర్గాల సమాచారం.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ వ్యూహానికి చెక్ పెట్టేలా అదే సెంటిమెంట్ తో వెన్నెలను బరిలోకి దింపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. గద్దర్ మృతి సానుభూతి, మహిళాకు ప్రాధాన్యత ఇవ్వటం వంటివి బేరీజు వేసుకొని పక్కా వ్యూహ్యంతో కాంగ్రెస్ పార్టీ వెన్నెలకు టికెట్ కేటాయించినట్టు తెలుస్తుంది. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పోరు రసవత్తరంగా మారింది.

ఒకవైపు మంచి నాయకునిగా పేరున్న సాయన్న కూతురు.. మరోవైపు తన గళంతో రాష్టాన్ని చైతన్య పరిచిన ఉద్యమ నాయకుడు, ప్రజా యుద్దనౌక గద్దర్ కుమార్తె మధ్య పోటీ తీవ్రమైన ఉత్కంఠకు తెర లేపింది.. వీరిద్దరి తండ్రులు ప్రజల గుండెల్లో నిలిచిన వారు కావడం.. వారిద్దరూ మరణించి ఉండటం.. ఇలా వీరికి సానుభూతి కలిసి వస్తుందని అంతా అనుకుంటున్నారు.

మరోవైపు గద్దర్ మరణించాక టీపీసీ రేవంత్ ఇతర కాంగ్రెస్ నేతలు దగ్గరుండి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన కుటుంబానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఆ తర్వాత గద్ధర్ కుటుంబం పేరు వార్తల్లో ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. దీంతో పార్టీ టికెట్ మ్యాటర్ సస్పెన్స్‌గా మారింది.

కాగా ఇటీవల ప్రెస్‌మీట్ నిర్వహించిన గద్దర్ భార్య విమల, కుమార్తె వెన్నెల.. తమకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదని కానీ ఆ పార్టీ సానుభూతి పరులమన్నారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా, ఇవ్వక పోయినా ఎన్నికల బరిలో నిలుస్తామని వెన్నెల స్పష్టం చేశారు. దీంతో వ్యూహాత్మకంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కంటోన్మెంట్‌లో పార్టీకి నష్టం జరగకుండా.. వెన్నెలకు టికెట్ కేటాయించిందని అనుకుంటున్నారు. ఇలా రెండు ప్రధాన పార్టీలు ఒకేచోట మహిళలకి టికెట్లు కేటాయించటంతో కంటోన్మెంట్ పోరు ఆసక్తికరంగా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదని అంతా అనుకుంటున్నారు..

You may also like

Leave a Comment