మహాభారత సంగ్రామాన్ని తలపిస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ప్రచారం నేటితో ముగియనుంది. ఇప్పటికే ఇల్లీగల్ యాక్టివిటీస్ (Illegal Activities)పై గట్టి నిఘా ఉంచిన అధికారులు.. ఎన్నికల పోరుకు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నికల కోసం మూడు కమిషనరేట్లలో కలిపి సుమారు 70 కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా బూత్ స్థాయి నుంచి సూక్ష్మ ప్రణాళికలతో సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు.
రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను (Assemble Elections) మూడు ప్రధాన పార్టీలు పతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. పోలింగ్ బూత్, రూట్ మొబైల్, పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్తో పాటు డీసీపీ (DCP)..ఏసీపీ (ACP) స్థాయి అధికారుల ఆధ్వర్యంలో సత్వర స్పందన బృందాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే సిబ్బంది కేటాయింపు.. అధికారులకు శిక్షణ పూర్తయ్యాయని.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలు విధుల్లో ఉంటాయని వెల్లడించారు.
ఎన్నికల కోసం స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రిజర్వు ఫోర్స్, ఏఆర్, ఎస్పీఎఫ్‌కు చెందిన దాదాపు 30 వేల మందికి పైగా బందోబస్తులో పాల్గొంటారని వివరించారు. మరోవైపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలింగ్ రోజున 129 పెట్రోలింగ్ వాహనాలు, 122 ఇతర పోలీసు వాహనాలు, 391 రూట్ మొబైల్స్ గస్తీలో పాల్గొంటున్నట్టు తెలిపిన అధికారులు.. 9 స్పెషల్ ఫోర్స్, 9 టాస్క్‌ఫోర్స్ బృందాలను, 71 మంది ఇన్‌స్పెక్టర్లు, 125 మంది ఎస్సైల్ని సత్వర స్పందన బృందాలుగా విభజించి వేర్వేరు ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తారని వెల్లడించారు..
ముఖ్య ప్రాంతాలుగా గుర్తించిన చోట అదనంగా 45 ఫ్లయింగ్ స్వ్కాడ్‌లతో పికెట్లు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అసాంఘిక చర్యలకు అవకాశం లేకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తెలిపారు. 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకూ పోలింగ్ జరిగే కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి సంచరించకూడదని అధికారులు ఆదేశాలిచ్చారు.