తెలంగాణ (Telangana) డీజీపీ (DGP) అంజనీకుమార్ (Anjani Kumar)పై వేటు పడింది. ఎన్నికల కోడ్ అమల్లోకి ఉండగా.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇంటికి వెళ్లి అభినందనలు తెలపటం.. అతని ఇంటి దగ్గర భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించటం వంటి పనులు చేయటంతో.. డీజీపీ అంజనీకుమార్ పై ఈసీ (EC) సస్పెన్షన్ వేటు వేసింది.. మరోవైపు ఈసీ అదనపు డీజీలు మహేష్ భగవత్, సంజయ్ కుమార్‌లకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
మరోవైపు ఎన్నికల సంఘం గెలిచిన పార్టీని అధికారికంగా ప్రకటించే వరకు కోడ్ అమల్లో ఉంటుంది. ఈసీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానిస్తారు గవర్నర్. అప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల సంఘం పరిధిలోనే పని చేస్తారు. అందుకు భిన్నంగా ట్రెండ్స్ కంటిన్యూ అవుతున్న సమయంలోనే.. అధికారికంగా గెలుపోటములను ప్రకటించకముందే.. ఓ పార్టీ అధ్యక్షుని ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేయటాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది..
ఇదిలా ఉండగా కొత్త డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను ఎన్నికల సంఘానికి పంపారు సీఎస్ శాంతకుమారి.. అందులో రవి గుప్తా, రాజీవ్ రాతన్ తో పాటు సజ్జనార్ ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా రవి గుప్తా (Ravi Gupta)ను ఈసీ నియమించింది. ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్ స్థానంలో రవిగుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు..కాగా రవిగుప్తా 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి..